‘కాంతార’ నటుడి ట్విట్టర్ ఖాతా నిలిపివేత

‘కాంతార’ నటుడి ట్విట్టర్ ఖాతా నిలిపివేత

కాంతార మూవీ నటుడు జి.కిశోర్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. వివాదాస్పద పోస్టులతో ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంగా ఆయన ఖాతాను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. కాంతారా మూవీలో అటవీ అధికారి పాత్రను జి.కిశోర్ కుమార్ పోషించారు. జి.కిశోర్ కుమార్ ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఆయనకు ఇన్ స్టాలో 43వేల మందికిపైగా ఫాలోవర్స్ , ఫేస్ బుక్ లో 66వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈ రెండు అకౌంట్లు కూడా అన్ వెరిఫైడే. 

జి.కిశోర్ కుమార్ ఇటీవల ఇన్ స్టాలో ఒక పోస్ట్ చేస్తూ.. ‘‘డిసెంబరు 30వ తేదీ పత్రికా స్వేచ్ఛకు, భారత ప్రజాస్వామ్యానికి చీకటి దినం లాంటిది. ఎందుకంటే ఆ రోజున ఎన్డీటీవీపై వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ పూర్తి పట్టును సాధించింది’’ అని కామెంట్ చేశారు. 

జనవరి 1న జి.కిశోర్ కుమార్ ఇన్ స్టాలో ఒక వీడియోను షేర్ చేస్తూ ఒక పోస్ట్ రాశారు. ‘‘కాంతారను ఎవరు అవమానించారు’’ అని అందులో  వివాదాస్పద ప్రశ్నను సంధించారు. ‘‘ దైవం అనే భావన వ్యక్తిగతమైంది. ఇతరుల మనోభావాలను ఎవరూ కించపర్చాల్సిన అవసరం లేదు. అలా కించపరిచే వాళ్లను చట్టం చూసుకుంటుంది. విశ్వాస భావనను వ్యక్తిగత అంశంగా పరిగణిస్తే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు.  ఈ వ్యాఖ్యల నేపథ్యంలో  జి.కిశోర్ కుమార్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయిందనే ప్రచారం జరుగుతోంది.