బీఆర్ఎస్ అంటే.. భ్రష్టాచార్ రాక్షస సమితి

బీఆర్ఎస్ అంటే.. భ్రష్టాచార్ రాక్షస సమితి
  • కేసీఆర్​ అంటే.. ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ
  • లోక్​సభలో బండి సంజయ్​ ఫైర్​
  • 24 గంటల కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
  • పేదల బియ్యాన్ని అమ్ముకున్న దొంగలు బీఆర్​ఎస్​ నేతలు
  • కేసీఆర్​ కుటుంబం ఆస్తులు వందల రెట్లు ఎట్ల పెరిగినయ్​?
  • బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, ఎంఐఎం ఒక్కటే
  • రాహుల్​ కిస్సులు, కన్నుగొట్టడాలు చూసి జనం నవ్వుకుంటున్నరు

న్యూఢిల్లీ, వెలుగు : బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని కరీంనగర్​ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ లీడర్ పేరు ‘ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ’ అని దుయ్యబట్టారు. ‘‘రాత్ మే పీతా, దిన్ బర్ సోతా, కిసిసే నహి మిల్తా.. ఆయనే బీఆర్​ఎస్​ నేత’’ అని ఎద్దేవా చేశారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు సొచ్చినట్లు.. తెలంగాణలో కేసీఆర్​ కుటుంబం సొచ్చి దోచుకుంటున్నదని మండిపడ్డారు. అవినీతి యూపీఏ కాస్త ఇండియా(ఐఎన్ డీఐఏ) గా ఎట్ల మారిందో... అదే రకంగా అవినీతి కుటుంబ టీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ గా మారిందని విమర్శించారు. గురువారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో సంజయ్​ పాల్గొని మాట్లాడారు. ‘‘బెంగాల్ కా దీదీ, బీహార్ కా జేడీ, ఢిల్లీ కా కేజీ, తెలంగాణ కేడీతో ఏమీ కాదు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ శక్తివంతమైన భారత్ నిర్మాణం కోసం శ్రమిస్తున్నది” అని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని, పార్లమెంట్​లో కలిసుంటాయని, బయట నటిస్తాయని బండి సంజయ్​ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్​కు వేసినట్లేనని అన్నారు. గత ఎన్నికల్లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే... బీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితేనే.. ప్రజలను న్యాయం జరుగుతుందన్నారు.  ‘‘లిక్కర్  పార్టీ బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు సంబంధాలు ఉన్నయ్​. అసలు తెలంగాణ లో కాంగ్రెస్ ఎక్కడుంది? దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్ కూడా రాలేదు” అని అన్నారు. బీజేపీని నిక్కర్ పార్టీ అంటూ వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. ‘‘దేశంలో సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని, హిందు ధర్మాన్ని సంఘటితం చేసే దేశభక్తి తో క్రమశిక్షణ కలిగిన సంస్థ ఆర్ఎస్ఎస్. భారతమాతను తలిచి, కొలిచి, ఆరాధించే సంఘ్.. ఆర్ఎస్ఎస్.  అలాంటి సంస్థను విమర్శిస్తే... పుట్టగతులుండవ్​” అని హెచ్చరించారు. 

రాష్ట్రాన్ని ఇచ్చిన పార్లమెంట్​కు శిరస్సు వంచి దండం పెడ్తున్న

‘‘తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవాలయం పార్లమెంట్​.  అలాంటి దేవాలయానికి శిరస్సు వంచి దండంపెడుతున్న. నీళ్లు, నిధులు, నియామకాల ఉద్యమాన్ని పార్లమెంట్​ సాకారం చేసింది’’ అని బండి సంజయ్​ తెలిపారు. ‘‘మా నీళ్లు మాగ్గావాలి, మా నిధులు మాగ్గావాలి, మా నియామకాలు మాగ్గావాలని.. 1,400 మంది బలిదానాలు చేశారు. రివాల్వర్ తో కాల్చుకొని, ట్రైన్ల కు ఎదురెళ్లారని జై తెలంగాణ అంటూ బలిదానాలు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై వెనుకడుగు వేసింది. 1,400  మందిని బలితీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. బీజేపీ మద్దతుతో తెలంగాణ కల సాకారమైంది”అని పేర్కొన్నారు. 

24 గంటల కరెంట్ ఇస్తే రాజీనామాకు సిద్ధం 

బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే.. తాను రాజీనామాకు సిద్ధమని, ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఎంపీలు రాజీనామాకు సిద్ధమా? అని బండి సంజయ్​ సవాల్​ చేశారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదనేది తాను ఫ్రూవ్ చేస్తానన్నారు. ‘‘మోదీ మణిపూర్ పోలేదని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు, రైతులు, ఆర్టీసీ కార్మికులు, జీవో 317 తో ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి ఎందుకు పోలేదు” అని ఆయన  ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒకటో తేదికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.  తెలంగాణ ప్రజల బతుకులను కేసీఆర్​ నాశనం చేశారని మండిపడ్డారు. 

కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎట్ల పెరిగినయ్​?  

కేసీఆర్ కుటుంబ ఆస్తులు అంతకంతకూ పెరిగిపోయాయని, అవి ఎట్ల పెరిగాయని సంజయ్​ ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచిన కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలను సభలో చదివి వినిపించారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుతో పోలిస్తే.. కేసీఆర్ కొడుకు ఆస్తుల 400 రెట్లు, కేసీఆర్ భార్య ఆస్తులు 1,800 శాతం, కోడలు ఆస్తులు 2,000 శాతం పెరిగినయ్​. తెలంగాణ రైతుల సగటు ఆదాయం రూ. 1, 12, 836 అయితే.. కేసీఆర్ వ్యవసాయ ఆదాయం రూ. కోటి, ఆయన కొడుకు వ్యవసాయ ఆదాయం రూ. 59.85 లక్షలు. రాష్ట్రాన్ని కేసీఆర్​ కుటుంబం దోచుకుంటున్నది” అని ఆరోపించారు. మధ్యలో బీఆర్ఎస్ ఎంపీలు స్పీచ్ కు అడ్డుపడడంతో.. తాను అన్ని విషయాలు చెప్తానని, ఏం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  

బియ్యం కూడా అమ్ముకున్న దొంగలు 

మహిళల ఆత్మగౌరవం కోసం కేంద్రం టాయిలెట్లు నిర్మిస్తే.. ఆ టాయిలెట్ల డబ్బులను కూడా బీఆర్ఎస్  నేతలు దోచుకున్నారని బండి సంజయ్​ ఆరోపించారు. రూ. 4 వేల కోట్లు అయ్యే మిషన్ భగీరథకు రూ. 40 వేల కోట్లని మోసం చేశారని మండిపడ్డారు. ‘‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నిధులిస్తే.. డబుల్ బెడ్ రూంల పేరుతో బీఆర్​ఎస్​ సర్కార్​ మోసం చేయడమే కాకుండా, కేంద్రం ఇచ్చిన పైసలు కూడా దోచుకున్నది. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకుండా వాళ్లకు నిలువ నీడ లేకుండా చేస్తున్నది” అని విమర్శించారు.  ‘‘గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉప్పు, పప్పులు, బియ్యం ఇస్తే.. ఆ బియ్యాన్ని కూడా అమ్ముకున్న దొంగలు బీఆర్ఎస్ నాయకులు.  గ్రామీణ ఉపాధి హమీ స్కీం కింద మహిళలకు ఇచ్చిన పైసలనూ దోచుకున్నరు. గ్రామీణ సడక్ యోజన కింద నేషనల్ హైవేలకు కేంద్రం ఫండ్స్ ఇస్తే.. భూసేకరణ చేయకుండా తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ సర్కార్ సహకరించడం లేదు” అని మండిపడ్డారు.

రాహుల్ ని చూసి నవ్వుకుంటున్నరు

అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఎందుకు ప్రవేశపెట్టిందో వాళ్లకే క్లారిటీ లేదని బండి సంజయ్​ అన్నారు. ‘‘ముద్దులు, కౌగిలింతలు, ఫ్లైయింగ్ కిస్ లు, కన్నుకొట్టుడు వంటి  రాహుల్ వ్యవహార శైలిని చూసి ప్రపంచమంతా నవ్వుకుంటున్నది. రాహుల్  తీరును చూస్తుంటే గజిని గుర్తుకువస్తున్నడు” అని విమర్శించారు. ‘‘‘భారతమాత హత్య ఎన్నటికీ జరగదు. ఇంటోడైనా, బయటోడైనా భారతమాత వైపు కన్నెత్తి చూస్తే... కండ్లు పీకి బొందపెట్టే హీరో ప్రధాని మోదీ’ అని చెప్పారు.