మొంథా ఎఫెక్ట్: ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకోండి: కరీంనగర్ సీపీ గౌస్ ఆలం

మొంథా ఎఫెక్ట్: ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకోండి: కరీంనగర్ సీపీ గౌస్ ఆలం

మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం ( అక్టోబర్ 29 ) రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. పలు చోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రేపు ( అక్టోబర్ 30 ) కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్న క్రమంలో కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇవాళ, రేపు ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకోవాలని సూచించారు.

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గౌస్ ఆలం.అత్యవసరమైతే తప్ప ఎవరూ తమ ఇళ్ల నుండి బయటకు రావద్దని అన్నారు. ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకోవాలని సూచించారు.ప్రమాదకరమైన ప్రాంతాల వైపు అస్సలు వెళ్లవద్దని అన్నారు.

ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్  +918712670744 ,+918712670745 నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు.

అన్ని పోలీసు స్టేషన్ల ఎస్.హెచ్.ఓ.లు అప్రమత్తంగా ఉండాలని.. వారి వారి స్టేషన్ పరిధిలోని గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.