- తీగలగుట్టపల్లి రైల్ ఓవర్ బ్రిడ్జి పూర్తి చేయాలని డిమాండ్
కరీంనగర్, వెలుగు : జాతీయ స్థాయి సమస్యలపైనే కాకుండా.. లోకల్ సమస్యలపైనా యూత్ స్పందిస్తున్నారు. కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో జాప్యంపై ఇద్దరు యువకులు ట్రాక్ పై కూర్చొని ప్రధాని మోదీపైన పాట పాడుతూ తెలిపిన నిరసన అటుగా వెళ్తున్న వారిని ఆకర్షించింది. కరీంనగర్ చొప్పదండి మార్గంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి మూడేళ్లుగా నత్తనడకన సాగుతోంది.
రైళ్ల రాకపోకల కారణంగా ప్రతి అరగంటకో సారి గేటు పడుతుండగా... 10 నిమిషాల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. చొప్పదండి వైపు నుంచి వచ్చే అంబులెన్స్ లు అనేక సార్లు ఈ గేట్ వద్ద నిలిచిపోవడంతో పేషెంట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కు చెందిన కోట శ్యాంకుమార్, బెల్లపు కరుణాకర్ ఆదివారం రైల్వే ట్రాక్ వద్ద కూర్చుని ప్రధాని మోదీ మన్ కీ బాత్ వింటూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
'మేము మీ మనసులోని మాట వింటున్నాం. మరి మా మనసులోని మాట ఎవరు వింటారు' అంటూ రైల్వే బ్రిడ్జి దగ్గర పడుతున్న కష్టాల గురించి తెలియజేశారు. ఐదేండ్లు గడుస్తున్నా చిన్న బ్రిడ్జి కూడా పూర్తి కాకపోవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారని శ్యాం కుమార్ వాపోయారు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలని ప్రశ్నించారు. చివరలో మోదీకి అంకితం అని పాట కూడా పాడారు.
