నెలాఖరులో కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కొత్త కలెక్టరేట్‌‌‌‌ ప్రారంభం : మంత్రి పొన్నం ప్రభాకర్

నెలాఖరులో కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కొత్త కలెక్టరేట్‌‌‌‌ ప్రారంభం : మంత్రి పొన్నం ప్రభాకర్
  •     మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సీఎం పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. 

బిల్డింగ్‌‌‌‌లోని వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రారంభమైన కలెక్టరేట్ నిర్మాణ పనులు వివిధ కారణాలతో పనులు నిలిచిపోయాయని, కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా చిత్రామిశ్రా బాధ్యతలు స్వీకరించాక ప్రత్యేక చొరవ తీసుకుని మిగిలిన పనులను స్పీడ్‌‌‌‌గా పూర్తిచేయించారని ప్రశంసించారు. సుడా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో విస్తృత స్థాయిలో గ్రీనరీ, ల్యాండ్‌‌‌‌ స్కేపింగ్ పనులు చేపట్టినట్లు చెప్పారు. సహచర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగర్‌‌‌‌ను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, లా కాలేజీ, ఫార్మసీ కాలేజీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మానేరు రివర్‌‌‌‌ ఫ్రంట్ రెండో దశ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, డంప్‌‌‌‌యార్డు తరలింపునకు కేంద్రం సహకారం కోరినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, ఆర్డీవో షర్మిల, అర్బన్ బ్యాంక్ చైర్మన్  రాజశేఖర్ పాల్గొన్నారు.