కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

కర్ణాటకలో ఎన్నికల పోలింగ్  ప్రారంభం

కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుంది.  ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. 80 ఏళ్లుపై బడిన వారు, దివ్యాంగులకు ఇంటినుంచే ఓటు వేసే హక్కును ఈసీ కలిపించింది.  రాష్ట్ర వ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 

బరిలో 2,615 మంది అభ్యర్థులు

రాష్ట్రంలో మొత్తం 224 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 2,430 మంది మేల్ క్యాండిడేట్స్, 184 మంది ఫీమేల్ క్యాండిడేట్స్, ఒకరు థర్డ్ జెండర్ క్యాండిడేట్ ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 

1.56 లక్షల మంది పోలీసులతో పటిష్ట భద్రత

అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా 1.56 లక్షల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 84,119 మంది రాష్ట్ర పోలీసులు కాగా, మిగతా వారిని ఇతర రాష్ట్రాల నుంచి విధుల్లోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది.  

మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు

కర్ణాటకలో  మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు అవసరం. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.  ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అనుకూలంగా కొన్ని పోల్ సర్వేలు వెలువడ్డాయి. 

హోరాహోరీ ప్రచారం

ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ హోరాహోరీ ప్రచారం చేశాయి. ప్రధాని మోడీ మ్యాజిక్ తో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డగా.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించింది. రాష్ట్రంలో ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మరోసారి కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జేడీఎస్ ముమ్మర ప్రచారం చేసింది. కన్నడ ఓటరు తీర్పు ఏమిటన్నది మే 13  శనివారం రోజున వెల్లడికానుంది.