అంటరానివాడివంటూ ఎంపీని ఊర్లోకి రానీయలే

అంటరానివాడివంటూ ఎంపీని ఊర్లోకి రానీయలే

Karnataka Dalit MP denied entry in Golla village, locals say he is untouchableఅంటరానితనం.. చట్టరీత్యా నేరం. మనుషులంతా ఒక్కటే, సమానులే అన్న భావనలకు గొడ్డలి పెట్టు ఇది. కానీ, దళితులన్న కారణం చేత కుటుంబాలను, వ్యక్తులను గ్రామ పెద్దలు వెలివేయడం లాంటి వార్తలు తరచూ చూస్తున్నవే. ఇటువంటి సందర్భాల్లో పోలీసులు, రాజకీయ నేతలు కలగజేసుకుని ఆయా గ్రామ పెద్దలకు సర్ది చెప్పడం, అవగాహన కల్పించడం చేస్తుంటారు. ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం పూర్తి భిన్నం. అంటరాని వాడివంటూ ఓ ఎంపీనే తమ గ్రామంలోకి రావొద్దని చెప్పడంతో ఆ పార్లమెంటేరియన్ వెనుదిరిగారు. ఆ ఊరికి ఏదో మేలు చేద్దామని వెళ్లిన ఆయనను దళితులు ఊర్లోకి రావడానికి లేదంటూ తిప్పి పంపేశారు.

ఇప్పటి వరకు దళితుల్ని అడుగుపెట్టనీయలేదు

బీజేపీ ఎంపీ నారాయణ స్వామి

కర్ణాటకలోని చిత్రదుర్గ (ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గ బీజేపీ ఎంపీ నారాయణ స్వామికి సోమవారం నాడు ఈ చేదు అనుభవం ఎదురైంది. తన నియోజకవర్గంలోని గొల్లరహట్టి గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ల టీమ్ తో కలిసి వెళ్లారు.

ఆ ఊరంతా  గొల్ల సామాజిక వర్గానికి చెందిన వారు అధికంగా ఉంటారు. తమ గ్రామంలోకి దళితులు రాకూడదంటూ కొందరు గ్రామస్థులు ఎంపీ నారాయణ స్వామిని అడ్డుకున్నారు. ‘మీ అంటరానివారు’, ఊరిలోకి ఇప్పటి వరకు దళితులెవరూ ప్రవేశించింది లేదని, అలా ప్రయత్నించినా రానీయలేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని వాదనకు దిగారు. వారికి మేలు చేసేందుకే వచ్చానంటూ ఎంపీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు చెవికెక్కించుకోలేదు. దీంతో చేసేది లేక ఆయన వెనక్కి వెళ్లిపోయారు.

దర్యాప్తు చేస్తున్నాం

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఎంపీ నారాయణ స్వామిపై వాదనకు దిగి, వెనక్కి పంపేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నామన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.