కర్నాటకలో డీకే సర్కార్. .కేబినెట్లో 13 మంది మంత్రులు

కర్నాటకలో  డీకే సర్కార్. .కేబినెట్లో 13 మంది మంత్రులు
  • సీఎంగా శివకుమార్ ప్రమాణం
  • కేబినెట్​లో మొత్తం 13 మంది మంత్రులు
  • మంత్రిగా సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర
  • ఖర్గే తనయుడు ప్రియాంక్​కూ కేబినెట్​లో చోటు
  • డిప్యూటీ సీఎంగా జి. పరమేశ్వర 
  • హాజరైన ఖర్గే, రాహుల్, సీఎం రేవంత్​

బెంగళూరు: కర్నాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు సీనియర్ నాయకుడు జి.పరమేశ్వర డిప్యూటీ సీఎంగా, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. లోక్‌‌భవన్‌‌లోని గ్లాస్‌‌హౌస్‌‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్‌‌చంద్ గెహ్లాట్ వీరిచేత ప్రమాణం చేయించారు. డీకే చేతిలో రాజ్యాంగం మినీ బుక్‌‌ను పట్టుకొని, తన గురువు  గంగాధర అజ్జయ్య నామస్మరణతో ప్రమాణం చేయగా.. డిప్యూటీ సీఎం పరమేశ్వర డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరుతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుక సందర్భంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అధికారిక ముగింపులో పోలీస్ బ్యాండ్ జాతీయ గీతాన్ని ఆలపించింది. ఈ సమయంలో అక్కడున్న ప్రముఖులు, అధికారులు, సీనియర్ నాయకులు గౌరవప్రదంగా నిల్చొని సెల్యూట్​ చేశారు. అంతకుముందు వేదికపై నుంచి ప్రజలకు డీకే సాష్టాంగ నమస్కారం చేశారు. తన సీనియర్ అయిన సిద్ధ రామయ్యను, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌‌ గాంధీని వేదికపైనే సత్కరించారు. ప్రమాణ స్వీకారానికి కొద్ది నిమిషాల ముందు బెంగళూరులోని లోక్ భవన్‌‌లో వీర గంగాధర అజ్జయ్య ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్‌‌ మల్లికార్జున ఖర్గే, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ, కేరళ, హిమాచల్‌‌ ప్రదేశ్‌‌ సీఎంలు రేవంత్‌‌రెడ్డి, వీడీ సతీశన్, సుఖ్విందర్ సింగ్ సుఖు, ఇతర ఏఐసీసీ నేతలు, పీఠాధిపతులు, ప్రముఖులు హాజరయ్యారు.

గాంధీ కుటుంబానికి డీకే కృతజ్ఞతలు

సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ఒకరోజు ముందే శివకుమార్.. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ తనపై మొదటి నుంచీ నమ్మకం ఉంచారని, ఆమె నాయకత్వంలోనే తాను కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కాగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డీకే శివకుమార్ మొదటిసారిగా విధాన సౌధకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ అధికారులు, మంత్రులు, పార్టీ నాయకులు ఆయనకు  స్వాగతం పలికారు.  శివకుమార్ అక్కడ ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి, బెంగళూరు వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందిన కెంపెగౌడ విగ్రహానికి  పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ప్రధాని మోదీ, ప్రముఖుల అభినందనలు

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్‌‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కర్నాటక ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం కలిసి పని చేస్తుందని ‘ఎక్స్‌‌’ వేదికగా వెల్లడించారు.  డీకేకు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం విజయ్ శుభాకాంక్షలు తెలిపారు. కర్నాటక రాష్ట్రం అభివృద్ధిలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డీకే శివకుమార్ సీఎం కావడంపై ఆయన భార్య ఉష సంతోషం వ్యక్తం చేశారు. శివకుమార్ కర్నాటక ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అంకితభావంతో పనిచేస్తారని, అనుకున్న ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కేబినెట్‌‌లో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం

కాంగ్రెస్ అధిష్టానం ఈ కేబినెట్‌‌లో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించింది. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే లకు మంత్రివర్గంలో చోటుదక్కింది. కేహెచ్‌‌ మునియప్ప, కె.జె.జార్జ్‌‌, ఎంబీ పాటిల్‌‌, రామలింగారెడ్డి, సతీశ్‌‌ జర్కిహోళి, కృష్ణబైరే గౌడ, యు.టి.ఖాదిర్‌‌, ఈశ్వర్‌‌ ఖండ్రే, బైరతి సురేశ్‌‌, శరణ్‌‌ ప్రకాశ్‌‌ పాటిల్‌‌కు మంత్రి పదవులు దక్కాయి. ఖాదర్ (ఇంతకుముందు స్పీకర్‌‌గా పనిచేశారు), యతీంద్ర సిద్ధరామయ్య మినహా.. మిగిలిన మంత్రులందరూ గత సిద్ధరామయ్య ప్రభుత్వంలోనూ మంత్రులుగా పనిచేసినవారే. కేబినెట్‌‌లో ఒక్కలిగ వర్గానికి చెందినవారు డీకే శివకుమార్‌‌‌‌తోసహా ఇద్దరు నేతలున్నారు  డిప్యూటీ సీఎం పరమేశ్వరతో సహా ఇద్దరు నేతలు దళితవర్గానికి చెందినవారు. ఇద్దరు మైనార్టీ నేతలకు కేబినెట్‌‌లో చోటు కల్పించారు.  రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం జూన్ 20న రెండో విడత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత మే 28న సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయడంతో, మే 30న కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) డీకే శివకుమార్‌‌ను ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకుంది.