క్లాస్ లోనే స్టూడెంట్కు ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్.. చెప్పులతో దేహశుద్ధి చేసిన విద్యార్థులు !

క్లాస్ లోనే స్టూడెంట్కు ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్.. చెప్పులతో దేహశుద్ధి చేసిన  విద్యార్థులు !

మెడికల్ కాలేజీలో సుందరాకాండ సీన్ రిపీటయ్యింది. అయితే ఇక్కడ మాస్టారే లవ్ గేమ్ ఆడాలని చూశారు. చివరికి విద్యార్థుల చేతుల్లో చెప్పుదెబ్బలు తిన్నారు. 2027 మార్చి 26న కర్ణాటకలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్ స్టూడెంట్స్ కు లవ్ ప్రపోజ్ చేయడమేంటి..? అంటూ చర్చ నడుస్తోంది. 

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక తుమ్కూర్ లోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్.. క్లాస్ లోనే స్టూడెంట్ కు ప్రపోజ్ చేసి భంగపాటుకు గురయ్యారు. ప్రొఫెసర్ అతికి ఆగ్రహించిన విద్యార్థులు చెప్పు దెబ్బలతో సమాధానం ఇచ్చారు. 

కర్ణాటక హోం మినిస్టర్ జి.పరమేశ్వర కు చెందిన కాలేజీ అది. మెడికల్ కాలేజీ వివాదం ఆ నోటా ఈ నోటా కర్ణాటక అంతా పాకిపోయింది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన యాజమాన్యం.. సదరు ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసింది. 

వివాదానికి కారణం ఇదే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సదరు ప్రొఫెసర్ ను అబ్దుల్ గా గుర్తించారు. మీ బ్యాచ్ చూపించిన ప్రేమను నేను దాచుకోలేక పోతున్న. అందుకే మీలోనే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నా. ఈ బ్యాచ్ మొత్తానికి చాక్లెట్స్ పంచుతున్నాను. ఐ లవ్ యూ.. అంటూ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ ముగించాడు. 

ప్రపోజ్ చేసి పోడియం నుంచి కిందికి దిగిన ప్రొఫెసర్ తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో.. ఆ అమ్మాయి తనకు ముందుగా ప్రపోజ్ చేసినందుకే తాను కూడా ప్రపోజ్ చేసినట్లు చెప్పాడు. 

స్టూడెంట్–ప్రొఫెసర్ వాగ్వాదం:

ప్రొఫెసర్: ఐ లవ్ యూ.. అని నువ్వు నాకు చెప్పలేదా..?
స్టూడెంట్: ఎప్పుడు ప్రపోజ్ చేశాను..?
ప్రొఫెసర్: నా దగ్గర సీసీటీవీ ఫూటేజ్ ప్రూఫ్ ఉంది

ప్రూఫ్​ ఉందని ప్రొఫెసర్ బొంకేందుకు ప్రయత్నించడంతో.. ప్రూఫ్ చూపించాలని అమ్మాయి పట్టుబట్టింది. దీంతో నీతో రేపు మాట్లాడతా.. అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు. క్లాస్ నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ కు చాక్లెట్స్ తీసుకోవాల్సిందిగా ఆఫర్ చేశాడు. 

ఇదంతా గమనిస్తున్న మరికొంత  మంది విద్యార్థులు ఆగ్రహంతో ప్రొఫెసర్ గొడవకు దిగారు. దాడి చేశారు. మరో  వీడియోలో ప్రొఫెసర్ పై అమ్మాయి చెప్పులతో కొట్టడం రికార్డయ్యింది. ప్రొఫెసర్ పారిపోయే ప్రయత్నం చేయగా.. పరిగెత్తించి దాడి చేశారు విద్యార్థులు. ప్రొఫెసర్ కారు ధ్వంసం అయ్యింది. ప్రొఫెసర్ తీవ్ర గాయాలతో స్పాట్ నుంచి బయటపడ్డాడు. కాలేజ్ యాజమాన్యం ప్రొఫెసర్ అబ్దుల్ ను సస్పెండ్ చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.