ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం పోరాడుతాం

ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం పోరాడుతాం

కాశ్మీర్ నేతలు

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌‌కు స్వయం ప్రతిపత్తి అందించే ఆర్టికల్ 370 రద్దయి ఏడాది దాటింది. గతేడాది ఈ ఆర్టికల్ రద్దు సమయంలో గుప్కర్ డిక్లరేషన్‌పై సంతకాలు చేసిన టాప్ కాశ్మీర్‌‌ లీడర్లు ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం పోరాడాలని డిసైడ్ అయ్యారు. ఆర్టికల్ 370, 35ఏ, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం దాని జాతీయత పునరుద్ధరణే లక్ష్యంగా పోరాటం చేయాలని సమాయత్తం అవుతున్నారు.

నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ ప్రెసిడెంట్ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గులాం అహ్మద్ మీర్, సీపీఐ (ఎం) జనరల్ సెక్రటరీ ఎంవై తరిగామి, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సాజద్ గనీ లోనె, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ముజఫర్ షా ఈ విషయాన్ని సంయుక్త ప్రటకనలో శనివారం తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పలు పార్టీల నాయకులు కలసి, సంతకాలు చేసి ఇలాంటి రాజకీయ ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ‘మేం అందరం కలసి ఉన్నామని మరోమారు పునరుద్ఘాటిస్తున్నాం. ఆర్టికల్స్ 370, 35ఏ, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం, దాని జాతీయత పునరుద్ధరణ కోసం మేం పోరాడుతాం. రాష్ట్రాన్ని విభజించడం ఆమోదనీయం కాదు’ అని జాయింట్‌ స్టేట్‌మెంట్‌లో నేతలు పేర్కొన్నారు.