తెలంగాణ వనరులను దోచుకుంటున్నరు..నాడు, నేడు రాష్ట్రంలో కేటీఆర్ పాలనే: కవిత

తెలంగాణ వనరులను దోచుకుంటున్నరు..నాడు, నేడు రాష్ట్రంలో కేటీఆర్ పాలనే: కవిత
  • నాడు కేటీఆర్ అంటే.. కేసీఆర్, తన్నీరు, రామారావు
  • నేడు.. కొండల్​రెడ్డి, తిరుపతిరెడ్డి, రేవంత్ రెడ్డి
  • అవినీతికి బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే.. కాంగ్రెస్ తలుపులు తెరిచిందని కామెంట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే ఆఖరి చాన్స్ అని, మరో 20 ఏండ్ల పాటు ఆ పార్టీని ప్రజలు బొందపెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఉందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్​ కవిత అన్నారు.  తెలంగాణ వనరులు, సంపద, భూములను ఈ ప్రభుత్వ పెద్దలు బందిపోట్లలాగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో అక్రమాలు, అవినీతికి బీఆర్​ఎస్​ ప్రభుత్వం కిటికీలు తెరిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం ఏకంగా తలుపులు తెరిచి దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు.

నాడు, నేడు రాష్ట్రంలో కేటీఆర్ పాలనే నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీశ్ రావు, కల్వకుంట్ల రామారావు అయితే, ఇప్పుడు కేటీఆర్ అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని విమర్శించారు. శనివారం ఆమె హైదరాబాద్​లోని టీఆర్ఎస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. గతంలో ఫీనిక్స్ సంస్థకు బీఆర్ఎస్ ప్రభుత్వం 50 ఎకరాల భూమిని ధారాదత్తం చేస్తే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇదే రేవంత్ రెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే ఫీనిక్స్ సంస్థకు మరో వంద ఎకరాలను కలిపి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రేవంత్ సర్కార్ లక్ష కోట్ల భూదోపిడీకి తెరతీసిందన్నారు. సీఎంకు నీటి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని, మొదట ఆయన ఆ సబ్జెక్టుపై నాలెడ్జ్ పెంచుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి ఆంధ్రాకు 260 టీఎంసీల నీళ్లు తీసుకోమని చెప్పడం రాష్ట్రానికి ద్రోహం చేయడమేనన్నారు.

బరాబర్ మా జాగీరే..

ఆంధ్ర విషపు కోరల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, ఇది బరాబర్​ తమ జాగీరేనని కవిత అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం తినకుండా బాధపడ్డానని చెప్పుకున్న పవన్ కల్యాణ్​.. ఆ బాధలోనే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ‘శిఖం’ భూములు కొనుగోలు చేశారన్నారు. సర్వే నంబర్ 706 పరిధిలోని ‘కోడికుంట’ చెరువుకు సంబంధించిన 10 ఎకరాల శిఖం భూమినే ఆయన కొన్నారని, ఇది పక్కా శిఖం భూమి అని ఇరిగేషన్ శాఖ సైతం నోటిఫై చేసిందని స్పష్టం చేశారు.

ఈ భూమి రిజిస్ట్రేషన్‌‌‌‌లో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. శిఖం భూమి అని తేలితే ప్రభుత్వానికి వాపస్ ఇస్తానని గతంలో ఆయనే స్వయంగా చెప్పారని, కనుక ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఆ 10 ఎకరాల భూమిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆ చెరువు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రశ్నిస్తే దాన్ని ‘ప్రాంతీయవాద ఉగ్రవాదం’ అని మాట్లాడమేంటని పవన్​పై మండిపడ్డారు.

సినిమా ఇండస్ట్రీకి అత్యధిక ఆదాయం వచ్చేది నైజాం ప్రాంతం నుంచేనని, ఇక్కడ కొనుక్కుంటున్న లగ్జరీ కార్లు, వేల కోట్ల భూములు అన్నీ తెలంగాణ ప్రజలు కొన్న సినిమా టికెట్ల సొమ్మేనని గుర్తుచేశారు. ప్రజల సొమ్ముతో బతుకుతూ, ప్రజా కళాకారుడు గద్దరన్నకు ఎప్పుడో ఒక కారు కొనిచ్చానని ఇప్పుడు ప్రచారం చేసుకోవడం గద్దరన్నను, తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనన్నారు.