V6 News

పదేండ్లు అధికారంలో ఉండి ప్రజల్లోకి పోలేదు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

పదేండ్లు అధికారంలో ఉండి ప్రజల్లోకి పోలేదు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
  •     అందుకే ఇప్పుడు కేటీఆర్​ పాదయాత్ర అంటున్నరు: కవిత
  •     రిజర్వేషన్ల విషయంలో మహిళలను బీజేపీ మోసం చేసిందని ఫైర్​

హైదరాబాద్​, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉండి కేటీఆర్​ ప్రజల్లోకి వెళ్లలేదని, ఇప్పుడు అందుకే ప్రజలను చూసేందుకు పాదయాత్ర చేస్తున్నారేమోనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. పదేండ్లు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ మాజీ ఎమ్మెల్యేలు కొందరు తనను కలిశారని, ఎవరన్నది మాత్రం చెప్పనని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో చిట్​చాట్​ చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్​ చేశారు కాబట్టి అప్పుడు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​నే ముందుగా టార్గెట్​ చేసుకున్నానన్నారు. ఇప్పుడు ప్రజాసమస్యలను పట్టించుకోని అధికార కాంగ్రెస్​ పార్టీపై మాట్లాడుతున్నానని చెప్పారు. సందర్భాన్ని బట్టి బీఆర్ఎస్​పైనా మాట్లాడతానని తెలిపారు. 

కొత్త పార్టీ పెట్టడానికి ముందు తల్లిదండ్రులు కేసీఆర్​, శోభ ఆశీర్వాదంపైనా ఆమె స్పందించారు. ‘‘పార్టీ ఏర్పాటుకు ఇంకా టైం ఉంది కదా?.. అప్పటివరకు ఆలోచిస్తా’’ అని పేర్కొన్నారు. పరిగిలో రైతు దీక్షకు మద్దతిచ్చేందుకు వెళ్తున్నానంటూ గుంటనక్క హౌస్​ అరెస్ట్​ అయ్యారని విమర్శించారు. హరీశ్‌‌‌‌రావు ఫోన్​ చేస్తేనే పోలీసులు ఆయన ఇంటికి వచ్చి హౌస్​ అరెస్ట్​ చేశారని ఆరోపించారు. తెలంగాణ కోసం, తెలంగాణ చేత, తెలంగాణ ఏర్పాటు చేసుకుంటున్న రాజకీయ పార్టీ తమదని కవిత పేర్కొన్నారు. తెలంగాణ మదర్​బోర్డుగా తమ పార్టీ ఉంటుందని చెప్పారు. అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని, 25న పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తామని తెలిపారు.  

అన్ని వర్గాలకూ అధికారం దక్కాలె

రాష్ట్రంలో అన్ని వర్గాలకూ అధికారం దక్కాలన్నదే తన ధ్యేయమని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకొని 12 ఏండ్లు గడిచినా కనీసం గ్రామ వార్డు పదవి కూడా పొందని కులాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి ఈ నెల 25 న ఏర్పాటు చేయబోతున్న పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించింది. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. బీఆర్ఎస్‌‌‌‌లో తాను ఎప్పుడైతే అన్ని వర్గాలకు అధికారం రావాలని కోరానో అప్పటి నుంచే తనకు కష్టాలు మొదలయ్యాయని వెల్లడించారు. రిజర్వేషన్ల విషయంలో మహిళలను బీజేపీ తీవ్రంగా వంచించిదని కవిత అన్నారు. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా బిల్లును కలపడంతోనే లోక్ సభలో వీగిపోయిందని చెప్పారు. 2027 సెన్సస్‌‌‌‌లో ఓబీసీలను లెక్కించి ఆ లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.