- ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ మూసీని కబ్జా చేస్తున్నదని గతంలో మీరే లెటర్ రాసి, ఇప్పుడు నన్ను బద్నాం చేస్తరా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
- ఈ వ్యవహరంలో నేను చేసిన ధర్నాపై తప్పుడు సమాచారంతో ‘ఎక్స్’లో వీడియోలు పెడ్తరా?
- ఆ వీడియోలను వెంటనే డిలీట్ చేయకపోతే మీపై పరువు నష్టం దావా వేస్తా..
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అనే మహమ్మారిని ప్రజల మీదకు వదిలిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మూసీకి 30 మీటర్ల వరకు బఫర్ జోన్‌లో ఉన్న ఇండ్లను కూల్చేస్తామన్నారని, కానీ, చెరువును ఆక్రమించి ఓ ప్రైవేట్ ప్రాపర్టీ నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మూసీ నది మధ్యలో ఆ ప్రాపర్టీని నిర్మిస్తుంటే తాము ఆందోళన చేశామని, అయితే, దీనిపై మాట్లాడని హైడ్రా అధికారులు.. తాము ఆందోళన చేస్తున్న వీడియోలను వాళ్ల ‘ఎక్స్’అకౌంట్‌లో పెట్టారని పేర్కొన్నారు. అక్కడ బిల్డింగ్ నిర్మాణాన్ని అడ్డుకోకుండా తమను బద్నాం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
మూసీని ఆక్రమించి నిర్మాణాలు కడుతున్నారంటూ ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌కు.. తాము ధర్నా చేయడానికి 6 నెలల ముందే హైడ్రా లేఖ రాసిందని ఆమె గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు తమదే తప్పున్నట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘మిస్టర్ రంగనాథ్.. మీ మీద పరువు నష్టం దావా వేస్తా’అని హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ జాగృతి ఆఫీసులో మీడియాతో కవిత మాట్లాడారు. నిజాలు చెబితే ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఎదురుదాడి చేస్తారా అని నిలదీశారు.
‘‘మీరు గ్రాఫిక్ డిజైనర్సా.. కంటెంట్ క్రియేటర్లా? నేను ఇచ్చిన ఆరు ఫిర్యాదుల మీద చర్యలు తీసుకునే దమ్ము మీకుందా? పైగా నిజం మాట్లాడితే నన్ను బద్నాం చేస్తవా... రంగనాథ్.. మిమ్మల్ని కచ్చితంగా కోర్టుకు లాగుతాను. మాపై ‘ఎక్స్’లో పెట్టిన వీడియోలను డిలీట్ చేయకుంటే కోర్టులో కేసు వేస్తా.. మీరు రాసిన లెటర్‌ను నేను ఆన్‌లైన్‌లో పెడితే.. మీరు, మీ ప్రభుత్వం బావిలో దూకి చచ్చిపోవాలి’’అని మండిపడ్డారు.
ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు..
ఆదిత్య రియల్టర్స్ వాళ్ల కబ్జా గురించి తాము ఇప్పటివరకు ఆధారాలతో సహా 6 ఫిర్యాదులు చేసినా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పట్టించుకోలేదని కవిత ఆరోపించారు. ‘‘మేము మార్చి 3న ధర్నా చేశాం. కానీ హైడ్రా రాకముందే దీనికి పర్మిషన్లు ఇవ్వడంతో మాకు సంబంధం లేదని మీరు ‘ఎక్స్’లో పెట్టారు. కానీ, మేం ధర్నా చేసిన బిల్డింగ్‌కు సంబంధించి 0.37 ఎకరాలు ఆక్రమణ జరిగిందని, 23 మీటర్లు ఎన్‌క్రోచ్ అయ్యిందని రంగనాథ్ ఒప్పుకున్నారు. ఉన్న నాలాలను డైవర్ట్ చేయకుండా కట్టారని.. దాని తర్వాత కోకాపేట, నార్సింగ్ ఏరియాలు వరదకు గురయ్యాయన్నారు.
ఇంకొక సందర్భంలో ఆదిత్య, కేడీఆర్ రియల్టీ వాళ్లు కట్టే ఈ బిల్డింగ్ ఆపకపోతే బిల్డింగ్‌లో ఉండే వారితో పాటు చుట్టుపక్కల వారి ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. దానికి సంబంధించి 2025 అక్టోబర్ 22న స్థానిక తహసీల్దార్‌కు రంగనాథ్ లేఖ రాశారు. వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి’’అని ఆమె పేర్కొన్నారు. బిల్డింగ్‌ను కడుతున్నోళ్లు.. నాలాలను డైవర్ట్ చేసి బిల్డింగ్ కడ్తామని పర్మిషన్ తీసుకున్నారని, కానీ, డైవర్ట్ చేయకుండా 3 ఎకరాలు కబ్జా పెట్టారని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మూసీలో కడుతున్న ఆ బిల్డింగును కూల్చాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఏం మాకు చదువు రాదా.. లాయర్లు లేరా?
బిల్డింగ్ కూల్చకుండా కోర్ట్ ఆర్డర్ ఉందంటున్నారని, ఏం తమకు చదువు రాదా.. మాకు లాయర్లు లేరా.. అని కవిత మండిపడ్డారు. తాను చేసిన ఆరోపణలన్ని గతంలో రంగనాథ్ చేసినవేనన్నారు. ‘‘2025, ఏప్రిల్‌లోనే 61 మీటర్లు కబ్జా అయ్యిందని మీరే చెప్పారు. కానీ పేదవాళ్లను ఆగం చేస్తూ.. పెద్దవాళ్లను కాపాడుతున్నారు. మూసీ పరివాహాక ప్రాంతాలను ప్రపంచ బ్యాంక్‌కు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ డీపీఆర్ సబ్మిట్ చేస్తున్నామని రెండ్రోజుల క్రితం చెప్పిన ప్రభుత్వం.. అసలు మూసీ చుట్టూ ఏం పని చేస్తారో చెప్పడం లేదు. ఇప్పటికీ ప్రాజెక్ట్ పూర్తి డీపీఆర్ లేదు.
గతేడాది సెప్టెంబర్‌లో ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టులో ఫేజ్1కు రూ.5,641 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. కానీ మొన్నటి ప్రజెంటేషన్‌లో రూ.6,500 కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తామన్నారు. ఆరు నెలల్లోనే దాదాపు రూ.1,400 కోట్లు ఎలా పెరిగింది”అని ఆమె ప్రశ్నించారు. ప్రజెంటేషన్‌కు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులను పిలిచి క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లా నిర్వహించారని, దీనికి మూసీ బాధితులను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. మూసీ పక్కన ఉన్న ల్యాండ్‌ను కేక్‌ల మాదిరిగా పంచుకునేలా మీటింగ్ పెట్టారని ఆరోపించారు.
