తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించడంతో కాబోయే సీఎం ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే.. కేరళ సీఎం పదవి రేసులో కేసీ వేణుగోపాల్ అందరి కంటే ముందున్నారని తెలిసింది. ఈ మేరకు పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ తమ నివేదికను పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించారు.
కొత్తగా ఎన్నికయ్యే శాసనసభ్యులు, మిత్రపక్షాలు, ప్రజల అభిప్రాయాల ఆధారంగా అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని మాకెన్, వాస్నిక్ తెలిపారు. కేరళ సీఎం పదవి రేసులో కేసీ వేణుగోపాల్తో పాటు వి.డి.సతీసన్, సీనియర్ నేత రమేష్ చెన్నితాల ఉన్నారు. అయితే.. ఈ ముగ్గురిలో కేసీ వేణుగోపాల్ కేరళ సీఎం పదవిలో కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో కేసీ వేణుగోపాల్ ముందు వరుసలో ఉంటారు. అలప్పుజ లోక్‌సభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఒకవేళ ఆయనను అధిష్టానం తదుపరి కేరళ ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తే ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. కేరళలో కాంగ్రెస్ కూటమి విజయంలో వేణుగోపాల్ అసలైన వ్యూహకర్త అని కేరళలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేశారు. కాంగ్రెస్, యువజన విభాగం కార్యాలయాల బయట ఆయనను 'నాయకన్ ', 'హీరో' అని చిత్రీకరిస్తూ పోస్టర్లు కూడా కనిపించాయి. ఇదిలా ఉండగా.. కేరళలో కొత్త ప్రభుత్వం సోమవారం కొలువు దీరనుంది.
ముఖ్యమంత్రి, మంత్రులు సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తమిళ సినీ నటుడు జోసెఫ్ విజయ్ కూడా కేరళలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ డీఎంకేకు గుడ్ బై చెప్పి టీవీకేకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
140 స్థానాలున్న సభలో యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. సొంతంగా 63 స్థానాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (22), కేరళ కాంగ్రెస్ (ఏడు) వంటి మిత్రపక్షాలతో కలిసి 102 స్థానాలు గెలుచుకుంది. పినరయి విజయన్ నేతృత్వంలోని సీపీఎం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు కేవలం 35 స్థానాలు మాత్రమే లభించాయి.
