- ఆ పైసలతోనే మెడికల్ కాలేజీలు, ప్రాజెక్టుల నిర్మాణం
- ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కట్టిండు..
- జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టిండు
- సీఎం రేవంత్ ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల అప్పు చేసిండు..
- జనానికి శఠగోపం పెట్టిండని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు దుర్మార్గమైన ప్రచారం చేశారని.. కానీ, పేదల ఇండ్లలో వెలుగులు నింపేందుకే కేసీఆర్ అప్పులు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘కేసీఆర్ రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిండని ఒకరంటే.. ఇంకొకరు 7 లక్షల కోట్లని, సీఎం ఏమో రూ.8 లక్షల కోట్లని పచ్చి అబద్ధాలు చెప్పారు. పదేండ్లలో కేసీఆర్ చేసిన అప్పు కేవలం రూ.2 లక్షల కోట్లేనని కేంద్రం, ఆర్బీఐ లెక్కలతో సహా చెప్పాయి” అని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాకముందు ఐదే మెడికల్ కాలేజీలు ఉండేవి. కానీ, కేసీఆర్ ప్రతి జిల్లాలోనూ ఓ మెడికల్ కాలేజీని పెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మించారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అందరికీ శఠగోపం పెట్టారు. రాష్ట్రంలో ఏ వర్గం వాళ్లూ సంతోషంగా లేరు. ఇటు దేశాన్ని నడిపిస్తున్న బీజేపీ కూడా సోయి లేకుండా పాలన చేస్తున్నది” అని ఫైర్ అయ్యారు.
మున్సిపల్‌ఎన్నికల్లో సత్తా చాటాలని నేతలకు పిలుపునిచ్చారు. అందరం కలిసిమెలిసి పనిచేసి, కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసుకోవాలన్నారు. ఒక పెద్ద కుటుంబమన్నాక.. చిన్న చిన్న గొడవలు సాధారణమని, వాటన్నింటినీ మరచిపోయి ముందుకు వెళ్లాలని సూచించారు. మున్సిపల్‌ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని, వరంగల్‌లో 12కు 12 గెలిచి కేసీఆర్‌కు బహుమతి ఇవ్వాలని పిలుపునిచ్చారు.
జనం.. కేసీఆర్దిక్కే చూస్తున్నరు: హరీశ్
రాష్ట్రం మొత్తం కేసీఆర్‌వైపే చూస్తున్నదని హరీశ్‌రావు అన్నారు. ‘‘కేసీఆర్అంటే నమ్మకం, భరోసా. ఆయన హయాంలో యూరియా కొరత లేదు.. రైతుబంధు పడేది.. రైతులకు 24 గంటల కరెంట్వచ్చేది. కానీ రెండేండ్ల కాంగ్రెస్‌పాలనలో రాష్ట్రం ఆగమైంది. గురుకుల స్కూళ్లలో విద్యార్థులు ప్రతిరాత్రీ భయపడుతూ బతుకుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. ఆడబిడ్డలకు బస్ ఫ్రీ అంటూనే.. మగవాళ్లకు డబుల్ చార్జీ వసూల్ చేస్తున్నారు” అని మండిపడ్డారు.
రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదన్నారు. కాగా, కడియం శ్రీహరి బురద రాజకీయాల వల్లే తాను బీఆర్ఎస్‌ను వీడాల్సి వచ్చిందని ఆరూరి రమేశ్అన్నారు. ‘‘ఎన్నికలకు ముందే రేవంత్‌తో కడియం శ్రీహరి ములాఖత్ అయ్యారు. వర్ధన్నపేటలో నేను ఓడిపోవడానికి కారణం కూడా ఆయనే. విధిలేని పరిస్థితుల్లోనే బీజేపీలోకి వెళ్లాను” అని చెప్పారు.
