ఇటు ఎన్డీఏకు, అటు ఇండియాకు కేసీఆర్, జగన్, బాబు దూరం

ఇటు ఎన్డీఏకు, అటు ఇండియాకు కేసీఆర్, జగన్, బాబు దూరం
  • రెండు కూటముల నుంచి అందని ఆహ్వానం!
  • బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ మౌనం.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరి
  • ఎన్డీఏ మీటింగ్​కు జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ హాజరు

హైదరాబాద్, వెలుగు: జాతీయ రాజకీయాల్లో కీలకమైన రెండు ప్రధాన కూటములు నిర్వహించిన సమావేశాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు దూరంగా నిలిచాయి. ఇటు ఎన్డీఏ మీటింగ్‌‌కు, అటు ప్రతిపక్షాల సమావేశానికి సీఎంలు కేసీఆర్, జగన్, మాజీ సీఎం చంద్రబాబు వెళ్లలేదు. నిజానికి ఈ రెండు కూటముల నుంచి వీరికి ఆహ్వానమే అందలేదని తెలుస్తున్నది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్డీఏ, లేదా ‘ఇండియా’తో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ మౌనంగా ఉండటం చర్చనీయాంశమవుతున్నది. ముఖ్యంగా జాతీయ రాజకీయాల కోసమే పార్టీ పేరును బీఆర్ఎస్‌‌గా మార్చిన కేసీఆర్ దారి ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది.

దేశాన్ని చుట్టొచ్చిన కేసీఆర్.. కానీ..టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌‌గా మార్చడానికి ఏడాది ముందు నుంచే కేసీఆర్​ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక పేరుతో దేశాన్ని చుట్టొచ్చారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్​సీఎంలతో పాటు ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ, జేడీఎస్ సహా పలు పార్టీల అధ్యక్షులతో సమావేశమయ్యారు. పార్టీ పేరు మార్చుతూ తీర్మానం చేసే సభలో జేడీఎస్​కీలక నేతలతో పాటు పలు పార్టీల ఎంపీలు, నాయకులు పాల్గొన్నారు. పార్టీ పేరు మార్పునకు సీఈసీ ఆమోదం తర్వాతనిర్వహించిన సభలోనూ వాళ్లంతా పాల్గొన్నారు. ఖమ్మం వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో కేరళ, ఢిల్లీ, పంజాబ్​సీఎంలు పినరయి విజయన్, అర్వింద్​కేజ్రీవాల్, భగవత్​సింగ్​మాన్, ఎస్పీ చీఫ్​అఖిలేశ్​యాదవ్, సీపీఐ సెక్రటరీ డి.రాజా తదితరులు హాజరయ్యారు. వీరందరూ ప్రస్తుతం అపొజిషన్ కూటమిలో కీలకంగా ఉన్నారు.

ఒంటరి పోరాటమే

పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీ తర్వాత ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పెషల్ ఫ్లైట్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌కు వచ్చి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిశారు. దీంతో బెంగుళూరులో జరిగే భేటీకి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను పిలుస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆ మీటింగ్‌‌‌‌కు​కేసీఆర్ దూరంగానే ఉన్నారు. నిజానికి తెలంగాణలోనే కాదు జాతీయ స్థాయిలోనూ బీఆర్ఎస్ ఉన్న కూటమిలో తాము కలువబోమని ఖమ్మం బహిరంగ సభలో రాహుల్​గాంధీ ప్రకటించారు. ఈ కారణంతోనే ప్రతిపక్ష కూటమిలోకి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఆహ్వానించలేదని తెలుస్తున్నది. దీంతో జాతీయ రాజకీయాల్లో ఒంటరి పోరాటానికే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అబ్​కీ బార్​కిసాన్​సర్కార్ నినాదంతో మహారాష్ట్రలో పార్టీ విస్తరణ ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్​పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు.

ఏపీ నుంచి జనసేన ఒక్కటే

టీడీపీ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. గత ఎన్నికల సమయంలో తెగదెంపులు చేసుకుంది. ఇక ఏపీలో అధికార వైసీపీ ముందు నుంచి ఒంటరిగానే సాగుతున్నది. కానీ కేంద్రంలోని బీజేపీతో మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నది. నేరుగా పొత్తు పెట్టుకోలేదు. టీడీపీ, వైసీపీ రెండూ కూడా బీజేపీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండేందుకే మొగ్గు చూపుతున్నాయి. కానీ తాజాగా నిర్వహించిన రెండు కూటముల సమావేశాలకు దూరంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఒక్కరే ఎన్డీఏ సమావేశానికి అటెండ్ అయ్యారు. బీజేపీకే తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పడం గమనార్హం.