V6 News

మిలియన్ మార్చ్ కేసులను కొట్టివేయండి : బీఆర్ఎస్ అగ్రనేతలు

మిలియన్ మార్చ్ కేసులను కొట్టివేయండి : బీఆర్ఎస్ అగ్రనేతలు
  •     హైకోర్టులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌రావుల పిటిషన్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంలో 2011 మార్చి 10న నిర్వహించిన ‘మిలియన్ మార్చ్’ సందర్భంగా నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ అగ్రనేతలు హైకోర్టును ఆశ్రయించారు. మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌‌రావు, మాజీ మంత్రులు కె.తారకరామారావు, టి.హరీశ్‌‌రావులు పిటిషన్​దాఖలు చేయగా,  జస్టిస్ కె.సుజన శుక్రవారం విచారణ చేపట్టారు. 

విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది టి.వి. రమణరావు కీలక వాదనలు వినిపించారు.  మిలియన్ మార్చ్ ఘటనకు సంబంధించి పోలీసులు జరిపిన దర్యాప్తులో, ఫిర్యాదుదారులు పిటిషనర్లను గుర్తించలేదని కోర్టుకు తెలిపారు. నిందితులుగా పేర్కొన్న వ్యక్తులు ఆ ప్రదేశంలో ఉన్నట్లు నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు లేవని, కావున ఈ కేసులను కొట్టివేయాలని ఆయన కోరారు. 

ప్రభుత్వ పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. మిలియన్ మార్చ్ కేసులో ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని, ఇతర నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేశామని వెల్లడించారు. అయితే, పిటిషనర్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌రావుతో పాటు ప్రొఫెసర్ కోదండరాంపై ఇప్పటి వరకు ఎలాంటి అభియోగ పత్రం దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.