పార్లమెంట్ లో ధర్నా.. ఎంపీలకు సీఎం ఆదేశం

పార్లమెంట్ లో ధర్నా.. ఎంపీలకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌, వెలుగు: వడ్లన్నీ కేంద్రమే కొనాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పార్లమెంట్‌లో ధర్నా చేయాలని సీఎం కేసీఆర్‌  టీఆర్​ఎస్​ ఎంపీలను ఆదేశించినట్టు తెలిసింది. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో నిరసన తెలుపాలని సూచించినట్టు సమాచారం. ఇప్పుడే జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, పార్లమెంట్‌ వేదికగానే నిరసన తెలుపాలని చెప్పినట్టు తెలిసింది. వడ్ల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతల బండారం బయటపడిందని.. ప్రజలకు దొంగెవరో, దొర ఎవరో క్లారిటీ వచ్చిందన్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేసీఆర్​ మాట్లాడుతూ.. సోమవారం కేబినెట్‌ సమావేశం తర్వాత యాసంగిలో రైతులు ఏ పంట వేయాల్నో తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతల సంగతి అందరికీ తెలియజెప్తానన్నారు.

పార్లమెంట్‌ నడిచేటప్పుడు ఢిల్లీకి వస్త
పార్లమెంట్‌ ఆవరణలో చేసే ధర్నాకు అవసరమైతే ఎమ్మెల్యేలు కూడా వస్తారని సీఎం కేసీఆర్​ చెప్పినట్లు తెలిసింది. పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగుతుండగానే తాను మళ్లీ ఢిల్లీకి వస్తానని, అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పినట్టు సమాచారం. రైతుల సమస్యలు, విద్యుత్‌ చట్టాలపై పార్లమెంట్‌లో నిరసన తెలిపే పార్టీలను బట్టి వాటికి మద్దతు తెలుపాలని, కరెంట్‌ చట్టాల రద్దు కోరుతూ అవసరమైతే  వెల్‌లోకి దూసుకెళ్లాలని సూచించినట్లు తెలిసింది.కొత్త విద్యుత్‌‌‌‌ చట్టాలు అమల్లోకి తెచ్చి ఉచిత కరెంట్‌‌‌‌ నిలిపివేయించే దిశగా కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించినట్లు సమాచారం. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం కూడా కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. 

వడ్ల సేకరణపై జాతీయ స్థాయిలో సమగ్ర విధానం తేవాలి
వరి సాగు, అత్యధిక దిగుబడి సాధించడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.  ఆహార ధాన్యాల సేకరణలో జాతీయ విధానం అవసరమని.. ‘‘సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం’’ కోసం పార్లమెంట్‌‌‌‌లో కేంద్రాన్ని డిమాండ్‌‌‌‌ చేయాలని ఎంపీలకు కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణంపై పూటకో మాట మాట్లాడుతూ కిరికిరి పెట్టిందని ఆయన ఆరోపించారు. 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, 60 లక్షల టన్నులు (40 లక్షల టన్నుల బియ్యం) మాత్రమే కొంటామని పాత పాట పాడుతోందని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి మంత్రులు, సీఎస్‌‌‌‌ ఆధ్వర్యంలో అధికారులతో కూడిన వేర్వేరు టీంలు కేంద్ర మంత్రి పీయూష్‌‌‌‌ గోయల్‌‌‌‌, కేంద్రంలోని ఉన్నతాధికారులను కలిసి మాలుమార్లు విజ్ఞప్తి చేసినా వడ్ల  కొనుగోళ్లపై తేల్చలేదన్నారు. యాసంగి పంటల సీజన్‌‌‌‌ ప్రారంభమైందని, రాష్ట్రంలోని రైతులు వరి నార్లు పోసుకుంటుంటే కేంద్రం బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ కొనబోమని కొర్రీలు పెడుతోందని దుయ్యబట్టారు.