బురదచల్లబోయి తనమీద తానే చల్లుకున్నడు: కిషన్ రెడ్డి

బురదచల్లబోయి తనమీద తానే చల్లుకున్నడు: కిషన్ రెడ్డి
  • హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: కిషన్​రెడ్డి
  • బీజేపీ కీలక నేతలను వేధించాలని కుట్రలు చేసిండు
  • ఆ నలుగురు ఎమ్మెల్యేలు తప్పు చేయకుంటే.. ప్రగతిభవన్​లో ఎందుకు బంధించినట్లు?
  • సీఎం ఆరాటం చూసి సిట్​ అధికారులే నవ్వుకుంటున్నరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై సీఎం కేసీఆర్​ బురదజల్లుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేని కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నిక ముందు అన్నీ తానై తీసి, దేశమంతా చూపించిన ‘ఫామ్ హౌస్​ ఫైల్స్’ సినిమా అట్టర్ ఫ్లాప్​ అయింది. 

బీజేపీ కీలక నేతలను వేధించాలని ఆయన ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే గెలిచింది. జరగనిది జరిగినట్టు.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినందుకే న్యాయస్థానం మొట్టికాయలు వేసి ఫామ్​హౌస్​ ఫైల్స్  కేసును సిట్​ నుంచి సీబీఐకి బదిలీ చేసింది. ఈ తీర్పు ఆ ఎమ్మెల్యేలకు, కేసీఆర్​కు, రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది” అని అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్​ ఆఫీసులో కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇతరులపై నిరాధారమైన ఆరోపణలు చేయడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 

ఇలాంటి విద్యలు కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి వెన్నతో పెట్టినవని అన్నారు. ‘‘రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయంగా ఏ రాజకీయ పార్టీ ఎదిగినా.. దాని ఇమేజ్ ను దెబ్బతీసేందుకు అర్థంపర్థం లేని విమర్శలు చేయడం బీఆర్ఎస్  ఎజెండాగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద  కోర్టులు కూడా సుమోటోగా కేసులు స్వీకరించి మొట్టికాయలు వేస్తున్నా.. అధికార పార్టీకి, ఆ పార్టీ నాయకులకు చీమకుట్టినట్లు కూడా లేదు.  ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్​ను ఎత్తేస్తే హైకోర్టు మొట్టికాయలతోనే మళ్లీ అక్కడ నిరసనలు తెలియజేసేందుకు అవకాశం కలిగింది” అని ఆయన చెప్పారు. 

కేసీఆర్​వి రాష్ట్ర పరువు తీసే చర్యలు

‘‘మీ ఎమ్మెల్యేలు తప్పు చేయకుంటే.. వారాల తరబడి సీఎం అధికార నివాసంలో వాళ్లను ఎందుకు బంధించారు” అని కేసీఆర్​ను కిషన్ రెడ్డి నిలదీశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సిట్ ను రద్దు చేసి కేసు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చిందని అన్నారు. ‘‘ప్రెస్ మీట్ పెట్టి పామ్ హౌస్​  ఫైల్స్ వీడియోలు చూపించడం ద్వారా కేసీఆర్ నవ్వుల పాలయ్యారు. తెలంగాణ పరువు తీసే ఇలాంటి చర్యలు ముఖ్యమంత్రి హోదాకు సరికాదు. ఈ కేసులో కేసీఆర్ ఆరాటాన్ని చూసి సిట్ లో ఉన్న పోలీసులే  నవ్వుకుంటున్నరు” అని విమర్శించారు. 

తనమీద తానే బురద చల్లుకుంటున్నడు

తెలంగాణ అమరవీరులు, ప్రజా సంఘాలు, సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద కేసీఆర్ కు  గౌరవం లేదని  కిషన్​ రెడ్డిఅన్నారు. ‘‘ఫామ్ హౌస్​ ఫైల్స్ లో నటించడానికి ఆ నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చి... తీరా నటించిన తర్వాత ప్రగతి భవన్​లో వారిని బంధించారు. ఇది కేసీఆర్ తీరు. బీజేపీ ఏ తప్పు చేయలేదు. కాంగ్రెస్​ గుర్తుతో గెలిచి, టీఆర్​ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలతో బీజేపీపై బురద చల్లించే ప్రయత్నం చేసి.. కేసీఆర్ తనమీద తానే బురద చల్లుకుంటున్నరు. బీజేపీపై బురద చల్లితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కమలం పువ్వు బురద నుంచే పైకి ఎదిగింది” అని పేర్కొన్నారు. నీతి, నిజాయితీ, పార్టీ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడడమేమిటని విమర్శించారు. ‘‘పార్టీలను ఖాళీ చేసి ఎమ్మెల్యేలను  చేర్చుకున్నది మీరు కాదా..”అని కేసీఆర్​ను ప్రశ్నించారు. 

ఆ ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు రికవరీ చేయలే?

ఫామ్​హౌస్​ కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉన్నప్పుడే.. వీడియోలు, వివరాలు కేసీఆర్​కు ఎలా చేరాయని కోర్టు ప్రశ్నించిందని కిషన్​రెడ్డి గుర్తుచేశారు. కల్పితమైన ఫామ్ హౌస్​ కేసులో న్యాయబద్ధంగా, పారదర్శకంగా దర్యాప్తు జరగడం లేదని ప్రజలు అనుమానించినట్లే.. హైకోర్టు కూడా సందేహం వ్యక్తం చేసిందని అన్నారు. ‘‘బీజేపీపై తెలంగాణ ప్రజల మనసులో నెగటివ్ అభిప్రాయాన్ని నెలకొల్పేందుకు.. సొంత పోలీసులతో కేసీఆర్ ‘సిట్’ ఏర్పాటు చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లను మాత్రం రికవరీ చేయలేదు.

 కేసీఆరే స్వయంగా ప్రెస్ మీట్  పెట్టి.. వీడియోలతో ఏదో పెద్ద ప్రళయం జరిగిందని చెప్పడం హాస్యాస్పదం. ఈ కేసులో డబ్బుల సమస్యే లేనప్పుడు ఈడీ ఎందుకు విచారిస్తుందని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఒక ఎమ్మెల్యే అంటున్నరు. మునుగోడు ఎన్నికల సమయంలో.. రూ. 400 కోట్ల డీల్ అని, ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు అని దుష్ప్రచారం చేసింది నిజం కాదా? ’’ అని ప్రశ్నించారు.