న్యూఢిల్లీ: భారత నౌకాదళ (నేవీ) నూతన చీఫ్‌గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. నేవీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు అడ్మిరల్ స్వామినాథన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్- ఇన్ చీఫ్‌గా సేవలందించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం స్వామినాథన్ మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం ప్రాంతీయ భద్రతా వాతావరణం సవాలుతో కూడుకున్నదిగా, అంచనాలకు అందకుండా ఉందన్నారు. ఈ నేపథ్యంలో నేవీని ఎల్లప్పుడూ యుద్ధానికి సన్నద్ధంగా ఉంచడమే తన మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ‘‘దేశ ప్రయోజనాలను కాపాడేందుకు భారత నేవీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది.
దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి నేవీ తన పోరాట సామర్థ్యాన్ని కొనసాగించేలా చూడడమే నా తొలి ప్రాధాన్యత. సామర్థ్యాల పెంపు, ఆధునీకరణ దిశగా నేవీ సరైన మార్గంలో పయనిస్తోంది. దేశ భద్రత, జాతీయ అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు కోసం నేవీని మరింత బలంగా, ప్రభావవంతంగా మార్చడానికి నా జీవితంలో ప్రతి ఒక్క రోజును అంకితం చేస్తాను” అని ఆయన తెలిపారు.
