న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్య సభ ఎంపీలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ మంత్రి పర్వేష్ వర్మ తీవ్ర విమర్శలు చేశారు. తాను సామాన్యుడి అంటూ గొప్పలు చెప్పుకునే కేజ్రీవాల్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని లోధి ఎస్టేట్‌లో తన కొత్త నివాసంలో కేజ్రీవాల్ రెండవ శీష్ మహల్ నిర్మించుకున్నారని ఆరోపణలు చేశారు.
కేజ్రీవాల్‌ను రణ్వీర్ సింగ్ ధురందర్ సినిమాలోని విలన్ రెహ్మాన్ డెయికాట్ పాత్రతో పోల్చారు. ఢిల్లీలో ఓడిపోయిన తర్వాత కేజ్రీవాల్ తన దృష్టిని పంజాబ్ వైపు మళ్లించారని అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం చుట్టూ ఉన్న అనేక ప్రభుత్వ వసతి గృహాలను కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సహా ఆప్ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. పర్వేష్ వర్మ ఆరోపణలను ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. పర్వేష్ వర్మ ఆరోపణలు అవాస్తవమని.. అతడి వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

