- ప్రియదర్శిని పథకాన్ని ప్రారంభించిన సీఎం వీడీ సతీశన్
తిరువనంతపురం: మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘ప్రియదర్శిని’ పథకాన్ని కేరళ ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. ఎన్నికల సందర్భంగా ప్రకటించిన హామీని నెరవేరుస్తూ యూడీఎఫ్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
కేరళ సీఎం వీడీ సతీశన్ తిరువనంతపురంలోని తంపనూర్ సెంట్రల్ బస్ స్టేషన్‌లో పథకాన్ని ప్రారంభించారు. సీఎం, ఇతర ప్రముఖులు బస్ స్టేషన్ నుంచి సచివాలయం వరకు మహిళా సిబ్బంది నిర్వహించిన బస్సులో ప్రయాణించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ నవ కేరళ నిర్మాణంలో ఇదొక నిర్ణయాత్మక అడుగు అని పేర్కొన్నారు.
తొలి దశలో వయస్సు, ఆదాయం, సామాజిక హోదాతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని మహిళలందరూ, ట్రాన్స్‌జెండర్లు ఉచిత ప్రయాణం చేయొచ్చు. దీనికోసం గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలు అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) నిర్వహిస్తున్న అన్ని ఆర్డినరీ బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది.
