Weather:కుండపోత వర్షాలతో రెడ్ అలర్ట్ ఇచ్చిన కేరళ

Weather:కుండపోత వర్షాలతో రెడ్ అలర్ట్ ఇచ్చిన కేరళ

తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు రాకతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో కేరళలో రాబోయే 5 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్,ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంగళవారం (మే 27) మూడు జిల్లాల్లో భారీ వర్షాలున్నాయని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కోజికోడ్, వయనాడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. 

అల్పపీడనం, నైరుతి రుతుపవనాల రాకతో భారీవర్షాలు కురుస్తున్నందున మంగళవారం కేరళ రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది ఐఎండీ.  కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.  

మరోవైపు కేరళ మీదుగా పశ్చిమ గాలులు బలంగా వీస్తాయిని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. తిరువనంతపురం, కొల్లం, అలప్పూజ జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

►ALSO READ | తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి రుతుపవనాలు.. నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. రాబోయే 5 రోజులు కేరళలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 27నుంచి -30 వరకు అతి భారీ వర్షాలు, 27నుంచి -31 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది.

సముద్రంలో మునిగిపోయిన ఓడ.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన కంటైనర్లు 

సోమవారం  కేరళ తీరంలో సముద్రంలో లైబీరియా కార్గోషిఫ్  MSC ELSA3 మునిగిపోయిన విషయం తెలిసిందే.   దీనికి సంబంధించిన కంటైనర్లు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మంగళవారం ఉదయం తిరువనంతపురం జిల్లాలోని వర్కల, అంచుతెంగు, అయిరూర్, ఎడవా తీరాల వెంబడి కంటైనర్లు కనుగొన్నారు. 

కోస్టల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంచుతెంగు, మాంపాల్లి, ముత్యాలపోళిలలో కూడా కంటెనర్ల నుంచి పార్శిళ్లు ఒడ్డుకు వచ్చాయి. ఓడ వర్కలలోని మంధర ఆలయానికి దగ్గరగా ఈ పార్శిళ్లు ఒడ్డుకు చేరాయి. మరోవైపు నౌక నుంచి ఇంధనం బయటికి రావడంతో సముద్రంలో చమురు తెట్టు ఏర్పడిందని వెంటనే తొలగించాలని  మెర్కంటైల్ మెరైన్ డిపార్టుమెంట్ షిప్పింగ్ కంపెనీ MSC  ఎల్సా 3ని ఆదేశించింది.