కేరళలో ఎటు చూసినా వరదలే.. ఐదు జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్ అలర్ట్

కేరళలో ఎటు చూసినా వరదలే..  ఐదు జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్ అలర్ట్
  • కేరళలో ఎటు చూసినా వరదలే
  • కాస్త తగ్గుముఖం పట్టిన వర్షాలు
  • ఐదు జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్ అలర్ట్

తిరువనంతపురం/మంగళూరు: రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అయింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పథనంతిట్ట, కొట్టాయం, కోజికోడ్, కన్నూర్, కాసర్​గోడ్ జిల్లాల్లో విద్యాసంస్థలకు శనివారం సెలవులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సహాయ శిబిరాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్​మెంట్ అథారిటీ తెలిపింది. ఇప్పటికే 186 శిబిరాల్లో 6500 మందికిపైగా తలదాచుకున్నారని, వర్షాల ఎఫెక్టుతో రాష్ట్రంలో వెయ్యిదాకా ఇండ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మన్నార్ లో కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు బ్లాక్ అయి ట్రాఫిక్ జామ్ అయింది. వరదలకు చాలక్కుడి నది నీటి మట్టం పెరిగింది. పెరింగల్​కుతు డ్యామ్ గేట్లు ఓపెన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. 

కోస్తా కర్నాటకలో భారీ వర్షాలు, మహిళ మృతి

దక్షిణ కన్నడ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంట్వాళలోని నందవరగుంపు వద్ద ఓ ఇంటిపై కొండ చరియలు విరిగిపడి ఓ మహిళ చనిపోయారని పోలీసులు తెలిపారు.  వరదల్లో చిక్కుకుపోయిన 53 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా డిజాస్టర్ మేనేజ్​మెంట్ అధికారులు తెలిపారు. దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ జిల్లాలకు ఐఎండీ శనివారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కాగా, వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్​లోని ధౌలి నది ఉప్పొంగింది. దీంతో బ్రిడ్జి కొట్టుకుపోయి దర్మ లోయలోని చాల్ గ్రామానికి బయటి ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిందని అధికారులు చెప్పారు.