ఖమ్మం టౌన్, వెలుగు : రైతుల ఆదాయం పెంచడం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం నిర్వహించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 128వ మహాజన సభ సమావేశంలో పీఐసీ అధ్యక్షుడు, కలెక్టర్ అనుదీప్ పాల్గొని, మాట్లాడుతూ సహకార సంఘం ద్వారా అందించే వివిధ రకాల రుణాలను వినియోగిస్తూ రైతులు ఎలా ఆర్థికంగా మంచి స్థితికి చేరుకోవచ్చు అనే అంశంపై అవగాహన కల్పించడం కీలకమని తెలిపారు.
సాగు యాంత్రీకరణకు రుణాల పంపిణీ పెంచాలని, దీనివల్ల అధిక సంఖ్యలో పంట పండి రైతులకు లాభం చేకూరుతుందన్నారు. అనంతరం స్థానిక బస్ డిపో రోడ్ లోని జిల్లా గ్రంథాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ తనిఖీ చేశారు.
జిల్లా గ్రంథాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పాఠకులకు, విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. లైబ్రరీ ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు భవనం, చుట్టూ ప్రహరీ, టాయిలెట్ల నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ శ్రీజతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిర్మిస్తున్న కొత్త రెండు అంతస్తుల భవనంతో పాటు విద్యార్థులకు, అభ్యర్థులు, పాఠకులకు కావాల్సిన వసతుల ఏర్పాట్లను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
