ఖమ్మం టౌన్, వెలుగు : ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ అఫ్ అట్రాసిటీ (పీవోఏ), పౌర హక్కుల పరిరక్షణ (ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్) యాక్ట్ ను జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ఆయన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు అందించిన వివరాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అమ్మ సేవ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు దృష్ట్యా అందులో ఉన్న నిరాశ్రయులకు, అనాథలకు గుర్తింపు పత్రాలు ఆధార్, ఇతరత్రా లభించేలా నిబంధన మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖమ్మం నగరం కార్పొరేషన్ 60వ డివిజన్ లోని ఎస్సీ శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా బాలాజీ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి పాల్గొని మాట్లాడారు.
టీబీ రహిత జిల్లాగా ఖమ్మంను తయారు చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలన్నారు. 100 రోజుల్లో హై రిస్క్ ఉన్న 94 గ్రామాల్లో టీబీ స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టి అనుమానితులను గుర్తించి అవసరమైన వైద్య పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించి, వెంటనే చికిత్స ప్రారంభిస్తామని తెలిపారు. ఆ తర్వాత వివిధ శాఖలలో ఎస్సీ అభివృద్ధి ఫండ్ పై, అంగన్వాడీల పని తీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సెయింట్ మేరిస్ స్కూల్ లో నిర్వహించిన పిల్లల భద్రత - డ్రగ్స్ కు అడ్డుకట్ట కార్యక్రమంలో కలెక్టర్ సీపీ సునీల్ దత్, ఈగిల్ టీమ్ ఎస్పీ గిరిధర్ తో కలిసి పాల్గొని డ్రగ్స్ నియంత్రణ పై రూపొందించిన పోస్టర్లు ఆవిష్కరించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం పై ప్రతిజ్ఞ చేశారు.
