ఖమ్మం, వెలుగు: హైదరాబాద్ నుంచి రాజమండ్రి, వైజాగ్ వెళ్లే ప్రయాణికులకు నేషనల్ హైవే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ హైవేపై రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడు నెలలుగా వైరా నుంచి దేవరపల్లి వరకు వాహనాలు నడుస్తుండగా, రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం పూర్తికాక ఖమ్మం బైపాస్ రోడ్డు మీదుగా ప్రయాణించాల్సి వచ్చేది. ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఆర్వోబీ ఒకవైపు పూర్తైన మార్గాన్ని ఆగస్టు 2 లేదా 3 నుంచి కార్లు, లారీలు, ఇతర భారీ వాహనాలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం వైరా–దేవరపల్లి మధ్య ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ వసూలు చేస్తున్నారు.
ఆర్వోబీ పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోవడంతో తల్లంపాడు–వైరా మధ్య టోల్ ఫీజు తాత్కాలికంగా మినహాయించారు. అక్టోబర్ నాటికి ఆర్వోబీ రెండో వైపు పనులు కంప్లీట్‌చేసి, పూర్తిస్థాయి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవేను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెప్పారు. అనంతరం ఈ హైవేను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. దంసలాపురం సమీపంలో ఆర్వోబీ ఒకవైపు మాత్రమే పూర్తవడంతో సుమారు 500 మీటర్ల మేర రెండు వైపులా టూ-లేన్‌లోనే వాహనాలు ప్రయాణించాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ పీడీ దివ్య తెలిపారు. వర్షాల కారణంగా రోడ్ మార్కింగ్, పెయింటింగ్ పనులు ఆలస్యమవుతున్నాయని, అవి పూర్తికాగానే వాహనాలను అనుమతిస్తామన్నారు.
