
రమేశ్ కత్తులు తెచ్చిండు.. శివరామకృష్ణ చంపిండు
నిందితులు ఐదుగురిది శనిగరమే
వరంగల్ రూరల్, వెలుగు: ఖమ్మం జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి పైసల లొల్లి కారణంగానే మర్డర్ అయ్యాడు. వరంగల్ డీసీపీ మల్లారెడ్డి బుధవారం హన్మకొండలో ప్రెస్‍మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆనంద్‍రెడ్డి, ప్రదీప్‍రెడ్డి మధ్య పైసల లావాదేవీలు ఉన్నాయి. ఆనంద్‍రెడ్డి తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని ప్రదీప్‍పై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని మర్డర్ చేయాలని ప్రదీప్‍రెడ్డి స్కెచ్ వేశాడు. దాని అమలు చేయడంలో భాగంగా డబ్బులు ఇస్తానని నమ్మబలికారు. వారి ఇసుక క్వారీలు ఉన్న భూపాలపల్లికి వెళదామని రమ్మన్నారు. ప్రదీప్‍రెడ్డి తనకు తోడుగా నిగ్గుల రమేశ్, విక్రమ్‍రెడ్డిని వెంట తెచ్చుకున్నాడు. ఆనంద్‍రెడ్డిని 7వ తేదీ ఉదయం హన్మకొండలోని అశోకా హోటల్ దగ్గరకు రమ్మని చెప్పి అందరూ కలిసి అక్కడే టిఫిన్ చేశారు. ఆపై నలుగురు కలిసి ఇన్నోవాలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో బయలుదేరి వెళ్లారు. దారిలో ఆనంద్‍రెడ్డిని తాళ్లతో కట్టేశారు. అరవకుండా నోటికి ప్లాస్టర్ వేశారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి భూపాలపల్లికి చేరుకున్నారు. స్కెచ్ ప్రకారం అక్కడ వారికి వెంగళ శివరామకృష్ణ, మీనుగు మధుకర్, నిగ్గుల శంకర్ తోడయ్యారు. అనంతరం అంతా కలిసి అక్కడి నుంచి 15 కి.మీ. దూరాన ఉన్న గొల్ల బుద్దారం, రాంపూర్ అటవీ ప్రాంతంలోని గట్టమ్మతల్లి దేవాలయం వద్దకు చేరుకున్నారు. దాదాపు 3.30 గంటల సమయంలో ఆనంద్‍రెడ్డిని కత్తులతో గొంతు కోసి చంపేశారు.
తమ్ముడూ వెళ్లాల్సి ఉండగా..
ఆనంద్‍రెడ్డితో పాటు ఆ రోజు తమ్ముడు శివకుమార్‍రెడ్డి సైతం వెళ్లాల్సి ఉంది. కొన్ని పనుల కారణంగా తమ్ముడు భూపాలపల్లికి లేటుగా వెళ్లాడు. మధ్యాహ్నం అన్నతో శివ మాట్లాడాడు. ఆపై ఫోన్ నెట్ వర్క్ పరిధిలో లేకపోవడంతో ప్రదీప్‍ను అడిగాడు. మధ్యాహ్నం వరకు తమతోనే ఉన్న ఆనంద్ ఆపై ఎవరితోనో వాహనంలో వెళ్లిపోయినట్లు ప్రదీప్చెప్పాడు. శివకుమార్‍రెడ్డి అదేరోజు నిందితుల సొంత ఊరైనా వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం వెళ్లి వాకబు చేశాడు. అప్పటికీ స్పష్టత రాకపోవడంతో 8న హన్మకొండ పోలీస్‍స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు. భూపాలపల్లికి వెళ్లిన తన అన్న ఆచూకీ తెలియడం లేదని చెప్పాడు. ఆనంద్‍రెడ్డికి ఫ్రెండ్స్మధ్య ఉన్న డబ్బుల గొడవను చెప్పి వారిపై అనుమానం వ్యక్తం చేశాడు. నిందితుల ఫోన్లపై నిఘా పెట్టిన పోలీసులు ఓ నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో మర్డర్ విషయం వెలుగుచూసింది.
ఎ1 నుంచి ఎ6..
ఆనంద్‍రెడ్డి హత్యలో పాల్గొన్న ఆరుగురు నిందితుల్లో ఒక్క విక్రమ్ రెడ్డి మినహా మిగతా ఐదుగురిది ప్రదీప్‍రెడ్డి ఊరైన శనిగరమే. వెంగళ శివరామకృష్ణ, మీనుగు మధుకర్, నిగ్గుల శంకర్ ఎప్పటినుంచో ఆనంద్‍రెడ్డికి చెందిన ఇసుక క్వారీల్లో పని చేస్తున్నారు. ఈ క్రమంలో వారంతా తమ బాస్ చెప్పినట్లు విన్నారు. కేసులో ఎ1గా పింగిళి ప్రదీప్‍రెడ్డి, ఎ2గా నిగ్గుల రమేశ్, ఎ3గా విక్రమ్‍రెడ్డి, ఎ4గా వెంగళ శివరామకృష్ణ, ఎ5గా మీనుగు మధుకర్, ఎ6గా నిగ్గుల శంకర్ ను గుర్తించారు. వెంగళ శివరామకృష్ణ, మీనుగు మధుకర్, నిగ్గుల శంకర్‍లను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు వాడిన క్వాలీస్ వాహనంతో పాటు రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ప్రదీప్‍రెడ్డితోపాటు రమేశ్, విక్రమ్‍రెడ్డి పరారీలో ఉన్నారు.
ప్రామిస్.. నాకేం తెలియదు
ఆనంద్ రెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డి సోదరుడు ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆనంద్ హత్యలో ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని ఊహాగానాలు వినిపించాయి. హత్యకు ముందు.. ఆ తర్వాత నిందితుడు ప్రదీప్ రెడ్డి తన సోదరునితో ఫోన్లో మాట్లాడినట్లు బయట ప్రచారం జరిగింది. దీంతో సీఐ ప్రశాంత్ రెడ్డి అలా స్పందించారు.