ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని 6 వ డివిజన్ రస్తోగి నగర్ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉండే ఒంటరి మహిళ తూమాటి కృష్ణవేణికి పుట్టుకతోనే ఇద్దరు పిల్లలు మానసిక పరిస్థితి బాగాలేక నిస్సహాయ స్థితిలో మంచంపైనే ఉంటున్నారు. 15 ఏండ్లుగా తల్లిదండ్రులు వారికి సేవలు చేస్తూనే ఉన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు.
అర్బన్ తహసీల్దార్ సైదులుతో మాట్లాడి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ సమగ్ర విచారణ జరిపి కృష్ణవేణికి డబల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయగా, బుధవారం ఇల్లు మంజూరు పత్రాన్ని మంత్రి తుమ్మల కొడుకు, కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, ఏఎంసీ చైర్మన్ వై.హన్మంతరావు, నాయకులతో కలిసి అందజేశారు.
