మధుమేహం అంటే ఇప్పుడు కేవలం రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడం మాత్రమే కాదు. ఇది లోపల మన అవయవాలను, ముఖ్యంగా కిడ్నీలను మెల్లగా దెబ్బతీసే వ్యాధి. కిడ్నీలు పాడవుతున్నా కూడా బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడమే అసలైన ప్రమాదం. అందుకే మనం కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి....
మధుమేహం వల్ల కిడ్నీలు దెబ్బతినేటప్పుడు నొప్పి రావడం లేదా వేరే ఏవైనా లక్షణాలు వెంటనే కనిపించవు. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు, అది కిడ్నీల్లోని చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసే శక్తిని కోల్పోతాయి. ఈ సమస్య ముదిరిన తర్వాతే బయటకు తెలుస్తుంది. అందుకే ముందు జాగ్రత్త చాలా ముఖ్యం.
షుగర్ అప్పుడప్పుడు పెరగడం, తగ్గడం కిడ్నీలకు అస్సలు మంచిది కాదు. కఠినమైన నియమాలు పాటించడం కంటే, రోజు ఉండే అలవాట్లను మార్చుకుని చక్కెర స్థాయిలను ఎప్పుడూ స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. షుగర్‌తో పాటు హై బీపీ ఉంటే కిడ్నీలు మరింత వేగంగా పాడవుతాయి. బీపీ పెరగడం వల్ల కిడ్నీ రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఎప్పటికప్పుడు తప్పకుండా బీపీని చెక్ చేయించుకోవాలి.
కిడ్నీలు ఎలా పని చేస్తున్నాయో తెలుసుకోవడానికి 'యూరిన్ ఆల్బుమిన్' & 'బ్లడ్ క్రియాటినిన్' పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ సమస్యను ప్రారంభంలోనే గుర్తిస్తే, దాన్ని నయం చేయడం లేదా పెరగకుండా ఆపడం సులభం అవుతుంది. చిన్న చిన్న నొప్పులకు కూడా మెడికల్ షాపులో దొరికే పెయిన్ కిల్లర్స్ మందులు వాడటం ప్రమాదకరం. ఇవి కిడ్నీలకు రక్త ప్రసరణను తగ్గించి, వాటిని దెబ్బతీస్తాయి. ఏదైనా మందులు వాడే ముందు డాక్టరును అడగడం మంచిది.
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి నీళ్లు తాగడం అవసరమే, కానీ మరీ లీటర్ల కొద్దీ తాగేయాల్సిన పనిలేదు. మీ శరీర అవసరానికి తగినంత నీరు తాగితే సరిపోతుంది. ఈ మధ్య కాలంలో బరువు తగ్గడానికి లేదా కండరాలు పెంచడానికి 'హై ప్రోటీన్' డైట్ తీసుకుంటున్నారు. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారికి అతిగా ప్రోటీన్ తీసుకోవడం భారం అవుతుంది. కాబట్టి ఆహార విషయంలో బ్యాలెన్స్ పాటించాలి.
ఈ చిన్న మార్పులను గమనించండి:
*కాళ్ల దగ్గర లేదా మడిమల వద్ద వాపు రావడం.
*విపరీతమైన అలసటగా అనిపించడం.
*మూత్రం వెళ్లేటప్పుడు రంగులో మార్పు రావడం.
ఇలాంటివి కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించాలి.
