ఎంఎస్పీ ప్రకటించాకే హైవే దిగుతం.. అధికారులతో చర్చలు విఫలం

ఎంఎస్పీ ప్రకటించాకే  హైవే దిగుతం..  అధికారులతో చర్చలు విఫలం

కురుక్షేత్ర (హర్యానా): పొద్దు తిరుగుడు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా పిప్లి నేషనల్ హైవే – 44పై రైతులు చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగింది. ‘ఎంఎస్పీ దిలావో.. కిసాన్ బచావో మహాపంచాయత్’ నినాదంతో భారతీయ కిసాన్ యూనియన్(చారుణి) ధర్నాకు పిలుపునిచ్చింది. సోమవారం అర్ధరాత్రి వరకు జిల్లా అధికారులతో రైతు సంఘాల లీడర్లు రెండు సార్లు జరిపిన చర్చలు సఫలం కాలేదు. దీంతో రైతులు హైవేపైనే కూర్చొని నిరసన తెలియజేశారు. ఎంఎస్పీపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు.  బీకేయూ లీడర్లు, సంయుక్త్​ కిసాన్ మోర్చా(ఎస్​కేఎం) నేతలతో కలిసి మంగళవారం సమావేశమయ్యారు. ఎంఎస్పీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతు నేతల ప్రకటించారు.

ఎంఎస్పీ చట్టం తీసుకురావాలి: టికాయత్

పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర సమస్య కేవలం హర్యానాలోని రైతులదే కాదని, దేశవ్యాప్తంగా ఉన్న రైతులది అని బీకేయూ లీడర్ రాకేశ్ టికాయత్ అన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు విఫలం అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు ఉపసంహరించుకున్న టైంలో ఎంఎస్పీ చట్టంపై హామీ ఇచ్చిందన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్​ చేశారు.

రైతు సంఘాల లీడర్లపై కేసులు 

ఎంఎస్పీపై కేంద్రంతో అధికారులు చర్చిస్తున్నారని, త్వరలో హైవేను క్లియర్ చేయిస్తామని కురుక్షేత్ర జిల్లా పోలీస్ అధికారి తెలిపారు. జాతీయ రహదారి దిగ్బంధం చట్టవిరుద్ధమని, కొంత మంది ఆందోళనకారులపై కేసు నమోదు చేశామన్నారు. ఎంఎస్​పీపై స్పష్టత కోరుతూ కురుక్షేత్రలోని పిప్లీ మార్కెట్ యార్డులో మహాపంచాయత్​ నిర్వహించిన రైతులు.. తర్వాత ఒక్కసారిగా నేషనల్ హైవేపై చేరుకుని ధర్నాకు దిగారని తెలిపారు. మహాపంచాయత్ నిర్వహించిన మార్కెట్​ యార్డులోని 2 కి.మీ పరిధిలో అమల్లో ఉన్న 144 సెక్షన్ ను రైతులు 
ఉల్లంఘించారని వివరించారు.