ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీస్తున్నరు: కిషన్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీస్తున్నరు: కిషన్ రెడ్డి
  • ఇంకెంతకాలం దర్యాప్తు చేస్తరు: కిషన్ రెడ్డి 
  • త్వరగా ముగించాలని డిమాండ్ 

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ కేసును సీరియల్‌‌‌‌లాగా సాగదీస్తున్నారని, ఇది ఇంకెంతకాలం కొనసాగుతుందో చూడాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. షార్ట్ ఫిలిం అయితే ఎప్పుడో ముగిసేదని, సీరియల్ కాబట్టే ఇంకా సాగుతున్నదని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌‌‌‌ విచారణపై ఆయన స్పందించారు. ‘‘తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని కేసీఆర్ కూతురు కవితనే ఆరోపించారు.

హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ప్రభుత్వమే హైకోర్టులో అఫిడవిట్ వేసింది. అయినా ఇంకెంతకాలం దర్యాప్తు చేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ట్యాపింగ్ జరిగింది. సొంత కుటుంబ సభ్యులు, మంత్రులు, జడ్జీలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఫోన్లు ట్యాప్ చేశారని ప్రభుత్వమే అఫిడవిట్ వేసింది. ఇది తీవ్రమైన నేరం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి’’ అని డిమాండ్ చేశారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేయాలని చెప్పేందుకు తాను పోలీస్ కాదని, చట్టం తన పని తాను చేసుకోవాలన్నారు.

కేంద్ర బడ్జెట్‌‌‌‌పై అవగాహన లేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ట్రిపుల్ ఆర్, మెట్రో సెకండ్ ఫేజ్, ఇతర ప్రాజెక్టులకు బడ్జెట్‌‌‌‌లో కేటాయింపులు చేయలేదని కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధికి శాఖకు బడ్జెట్‌‌‌‌లో రూ.28 వేల కోట్లు కేటాయించాం. ఈ నిధుల నుంచి మెట్రో ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందుతుంది. అయితే ఏ రాష్ట్రానికి సంబంధించి అనేది బడ్జెట్‌‌‌‌లో ఉండదు” అని పేర్కొన్నారు. కాగా, నైనీ కోల్‌‌ బ్లాక్‌‌ టెండర్ల వివాదంలో వాస్తవాలను తేల్చేందుకు ఇద్దరు అధికారులతో ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీ రిపోర్ట్ వచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే, బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉండడంతో ఈ రిపోర్ట్ ను ఇంకా పరిశీలించలేదని చెప్పారు.