అబద్ధాల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ: కిషన్​రెడ్డి

అబద్ధాల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ: కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో కల్వకుంట్ల కుటుంబానికి, రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఆ పార్టీ రాష్ట్ర నేతలు కృష్ణయాదవ్, ఎన్వీ సుభాష్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. 

తెలంగాణకు యూరియా పరిశ్రమ తీసుకొస్తే, పేదల ఇండ్లళ్లో వెలుగులు ప్రసరింపజేస్తే అది గాడిద గుడ్డు లా కనిపిస్తున్నదా? అని ప్రశ్నించారు. గెలవలేని సీట్లకు కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి చెప్తుండటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలువబోతున్నదని, దీంట్లో ఎలాంటి అనుమానం లేదని చెప్పారు. విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారం తమకు సానుకూలంగా మారుతోందని అన్నారు.  

బీఆర్ఎస్ పార్టీకి పదేండ్లు ప్రజలు అవకాశం ఇచ్చారని,  అంతకుముందు పదేండ్లు కాంగ్రెస్ కు పీఠాన్నిచ్చారని, ఈసారి మెజార్టీ సీట్లు, బీజేపీకే ఇవ్వాలని ప్రజలు  నిశ్చయించుకున్నారని తెలిపారు. దీంతో కాంగ్రెస్ లో కలవరం పెరుగుతున్నదని, రేవంత్ రెడ్డి ప్రసంగాల్లోనూ ఈ అసహనం కనిపిస్తున్నదని అన్నారు. రేవంత్  చెప్పేదొకటి, చేసేదొకటి అని, కేంద్ర ప్రభుత్వంపై సీఎం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి స్వయంగా తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ రిజర్వేషన్లపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పినా.. కాంగ్రెస్​ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నదని అన్నారు. 

కాంగ్రెస్  ప్రచారం ఫెయిల్ 

ఇద్దరు, ముగ్గురు జర్నలిస్టులను జైళ్లో వేస్తే బుద్ధి వస్తుందన్న రేవంత్ రెడ్డి మాటలు.. ఆయన అహంకారానికి నిదర్శనమని కిషన్​రెడ్డి అన్నారు. బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప చేతల్లో చూపించే సోయి రేవంత్​కు లేదని విమర్శించారు. రీసెర్చ్ టీమ్ పెట్టుకొని.. ఏ తిట్లు తిట్టాలి? ఏ వీడియో ఫేక్ చేయాలి? అనే దానిపై ఆలోచన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

రైతు భరోసాను కేంద్ర ఎన్నికల సంఘం ఆపిందని చెప్పారు.  ఎన్నికలు వస్తాయని ముందే తెలిసినా.. రైతుభరోసా ముందు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా.. ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ రెండంకెల మార్క్​ దాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 10న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సమావేశంలో మోదీ పాల్గొంటారని, నేడు (గురువారం) భువనగిరిలో జరిగే సభకు అమిత్ షా అటెండ్ అవుతారని కిషన్​రెడ్డి తెలిపారు.