మందులపై 50 నుంచి 90 శాతం తగ్గింపు..

మందులపై 50 నుంచి 90 శాతం తగ్గింపు..

సామాన్యులపై వైద్యం, ఔషధాల ఖర్చు తగ్గించడమే ప్రధానమంత్రి భారతీయ జనఔషధీ పథకం లక్ష్యమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.హైదరాబాద్ వారాసిగూడలో పీఎం జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. మొదట్లో  జిల్లా కేంద్రంలో  ఒక జన ఔషధి  ఉండాలన్న సంకల్పంతో ప్రారంభించి.. ఆ తర్వాత ఫ్రాంచైజీ మోడల్ ద్వారా వీటి సంఖ్యను  కేంద్రం పెంచిందన్నారు.

50 నుంచి 90 శాతం వరకు తగ్గింపు


సాధారణ మెడికల్ షాపుల్లో దొరికే రేట్ల కంటే జనఔషధి కేంద్రాల్లో మందులు  50 నుంచి 90 శాతం తక్కువ ధరకే లభిస్తాయన్నారు. తక్కువ ధరకే ఇస్తున్నా..మందుల నాణ్యత విషయంలో రాజీ పడటం లేదని కేంద్రమంత్రి తెలిపారు. 8 ఏళ్లలో జన ఔషధి కేంద్రాలు, వీటి ద్వారా జరుగుతున్న ఔషధాల అమ్మకాల్లో గణనీయమైన మార్పు కనబడుతోందన్నారు కిషన్ రెడ్డి అన్నారు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు. 2017లో 3వేల జనఔషధి కేంద్రాలు ఉండగా.. మార్చి 2020 నాటికి ఈ సంఖ్య 6 వేలకు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 9వేలకు పైగా  జన ఔషధి కేంద్రాలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి .

1700 రకాల మందులు.. ఇంకా పెంచుతాం

జన ఔషధి కేంద్రాల ద్వారా ఉపాధి కల్పన జరుగుతోందని అన్నారు. జన ఔషధి సుగమ్ మొబైల్ యాప్ ద్వారా కేంద్రాలు, మందుల రేట్లు తెలుసుకోవచ్చన్నారు. మెడికల్ షాపుల్లో దొరికే రేట్ల కంటే జనఔషధి కేంద్రాల్లో తక్కువ ధరకే మందులు లభిస్తాయని తెలిపారు. జన ఔషధి కేంద్రాల నిర్వాహకులకు ప్రోత్సాహకం రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు కేంద్రం పెంచిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జనరిక్ మెడికల్ షాపుల్లో 1700 మెడిసిన్స్ ఇస్తున్నారని, ఈ సంఖ్యను మరింత పెంచుతామని తెలిపారు.