ఓట్లు చీల్చే కుట్రను తిప్పి కొట్టాలి: మంత్రి కిషన్​రెడ్డి

ఓట్లు చీల్చే కుట్రను తిప్పి కొట్టాలి: మంత్రి కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు చీల్చే కుట్ర చేస్తున్నాయని, తిప్పి కొట్టాలని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్​బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా ఐక్యంగా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. 

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల అభ్యర్థులకు ఓటు వేస్తే మూసీలో వేసినట్టేనన్నారు. ఒక్క ఓటు కూడా వేస్ట్​చేయొద్దన్నారు. కిషన్​రెడ్డి శుక్రవారం నాంపల్లి నియోజకవర్గంలో జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నాయకత్వం దేశంలోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని, గడిచిన తొమ్మిదన్నరేండ్లలో అన్ని వర్గాలకు అండగా నిలిచారని చెప్పారు. 

మూడోసారి మోదీని ప్రధానిని చేయాలని, సికింద్రాబాద్ లో తనను ఎంపీగా ఆశీర్వదించాలని కోరారు. కరోనా కష్టకాలం నుంచి ఉచితంగా రేషన్​బియ్యం ఇస్తున్నామని, పొదుపు సంఘాలకు రూ.20లక్షల లోన్లు ఇచ్చామని గుర్తుచేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. మోదీ లేకపోతే దేశంలో అవినీతి పెరిగిపోయేదని, మజ్లిస్ గుండాయిజం, అరాచకాలు ఎక్కువయ్యేవన్నారు. తనను గెలిపిస్తే నాంపల్లిని అభివృద్ధి చేస్తానని కిషన్‌‌‌‌ రెడ్డి హామీ ఇచ్చారు. కిషన్​రెడ్డి వెంట యువ నాయకుడు దేవర వంశీతో పాటు కార్యకర్తలు ఉన్నారు.