- ఆ రెండు ప్రభుత్వాలు రూ.52 వేల కోట్లు వాడుకున్నాయి: కిషన్‌రెడ్డి
- కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితికి సింగరేణిని దిగజార్చారు
- సంస్థను కాపాడుకోవాలంటే ఆ రెండు పార్టీలను ఓడించాలి
- అప్పుల ఊబిలో కూరుకున్న సింగరేణిని కాపాడేది బీజేపీ మాత్రమేనని కామెంట్
- మంచిర్యాల, రామగుండంలో బీజేపీ కార్నర్ మీటింగ్స్‌కు హాజరు
మంచిర్యాల/గోదావరిఖని/సుల్తానాబాద్, వెలుగు: సింగరేణిని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాశనం చేశాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సంస్థను కాపాడుకోవాలంటే ఆ రెండు పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పుల ఊబిలో కూరుకున్న సింగరేణిని బీజేపీ మాత్రమే రక్షిస్తుందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి పట్టంగట్టాలని కోరారు. సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద, రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి సెంటర్, గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏనాడూ సింగరేణి సంస్థలో జోక్యం చేసుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
సింగరేణి సంస్థకు సంబంధించిన రూ.52 వేల కోట్లను గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు వాడుకున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వం రూ.40 వేల కోట్లు బకాయి పెడితే, రేవంత్‌రెడ్డి గవర్నమెంట్ రూ.12 వేల కోట్లు పెండింగ్ పెట్టిందన్నారు. కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితికి సింగరేణిని దిగజార్చారని విమర్శించారు. సింగరేణి కాంట్రాక్టుల్లో నాడు కేసీఆర్ ఫ్యామిలీ, నేడు సోనియాగాంధీ ఫ్యామిలీ 12 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణిలో కొత్త క్వార్టర్లు కడుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు.. ఉన్న క్వార్టర్లను కబ్జా చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దగా చేసిందని, ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని అన్నారు. పింఛన్ల పెంపు, తులం బంగారం, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డులులాంటి హామీలు అటకెక్కాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మనకు మనమే అన్యాయం చేసుకున్న వాళ్లమవుతామని వ్యాఖ్యానించారు. ‘సేవ్ సింగరేణి’, ‘సేవ్ తెలంగాణ’ కోసం బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
రామగుండంలో రౌడీయిజం
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ లో ప్రస్తుతం రూ.11 వేల కోట్లతో ప్లాంట్ నిర్మాణం జరిగిందని, మరో రూ.20 వేల కోట్లతో ప్లాంట్‌ను విస్తరించనున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. దీనివల్ల వందల మందికి ఉద్యోగాలు, వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రామగుండంలో రౌడీయిజం కొనసాగుతున్నదని, కొందరు కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల్లో చొరబడి దాదాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని రాత్రికి రాత్రే 46 ఆలయాలను కూల్చివేసి.. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, అలాంటి వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణలో కారు పంక్చర్ అయిందని, కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమైండని ఎద్దేవా చేశారు. ‘మా నాయిన, అన్న ఏం పీకారని కారు గుర్తుకు ఓటెయ్యాలి’ అని స్వయంగా కేసీఆర్ బిడ్డ కవితనే ప్రశ్నిస్తున్నదని, ప్రజలు కూడా ఈ విషయం గురించి ఆలోచించాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉందని కిషన్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీల్లోనూ గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో, కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో మున్సిపాలిటీలకు చేసిందేమీ లేదని చెప్పారు. శానిటేషన్ సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితిలో మున్సిపాలిటీలున్నాయని తెలిపారు.
