- ఎంఎంటీఎస్ సర్వీస్ల్లోమెరుగుదలకు చర్యలు చేపడతాం
- రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల్లో వేగం,ఎంఎంటీఎస్ సర్వీస్ సేవల్లో మెరుగుదల కోసం చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఢిల్లీలోని రైల్వే భవన్‌లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 42 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులపై చర్చించారు. ఎంఎంటీఎస్ సర్వీస్‌ల టైమింగ్స్ రెగ్యులరైజేషన్, సౌకర్యాలను మరింత మెరుగుపరిచేలా చొరవ తీసుకోవాలని రైల్వే మంత్రిని కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.. త్వరలోనే రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ‘‘ రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, హైస్పీడ్ రైల్ కారిడార్ పనుల పురోగతి తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తోంది. రానున్న రోజుల్లో రైల్వే నెట్‌వర్క్ పెంచడం, ప్రజలకు సౌకర్యాల అభివృద్ధిలో పూర్తి సహకారం ఉంటుందని రైల్వేమంత్రి భరోసా ఇచ్చారు’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
