కేరళలో రేవంత్‌‌ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేరళలో రేవంత్‌‌ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  •     తెలంగాణలో ఆరు గ్యారంటీలు అట్టర్ ఫ్లాప్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 
  •     రేవంత్ రెడ్డి మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని రేవంత్ ​రెడ్డి చెప్పడం కేరళ ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. 

తెలంగాణలో అమలు చేయని స్కీములను చేసినట్లు చెప్పుకోవడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మహిళలకు నెలకు రూ.2,500,  వృద్ధులకు నెలకు రూ.4 వేల పింఛన్​ ఏమైందన్నారు. ‘దళితులకు రూ.12 లక్షలు, బీసీలకు లక్ష కోట్లు ఎటు పోయాయి? పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం లేదు.. నిరుద్యోగులకు భృతి లేదు. రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదు. 

ఇవన్నీ అక్కడ రేవంత్ రెడ్డి చెప్పగలరా?’ అంటూ ప్రశ్నించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్‌‌పై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డలో కొన్ని పిల్లర్ల గురించి మాట్లాడటం కాదని.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపుతాం.. లక్ష కోట్లు వసూలు చేస్తామన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారో చెప్పాలని ప్రశ్నించారు.

కేరళ ప్రజలకు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ..

ఆరు గ్యారంటీల అమలుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు నమ్మొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పొలిటికల్ టూరిస్టులు రాష్ట్రానికి వచ్చి కల్లబొల్లి మాటలతో మాయ చేస్తారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేరళం ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు.