
- పలు చోట్ల పోలింగ్ కు అంతరాయం
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో కొద్దిసేపు పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. వెంటనే ఈవీఎంలను అధికారులు సరి చేయించడంతో పోలింగ్ కొనసాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కావాల్సి ఉండగా కొన్ని చోట్ల ఈవీఎంల సమస్యతో పోలింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.
సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి బర్కత్ పురలో ఓటు వేసేందుకు రాగా, ఈవీఎం మొరాయించింది. దీంతో తాను గంట సేపు వెయిట్ చేసి ఓటు వేసినట్టు ఆయన మీడియాకు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఈవీఎంలో సమస్య తలెత్తగా పోలింగ్ ఆలస్యంగా స్టార్ట్ అయింది. బాన్సువాడలో వీవీప్యాట్ మొరాయించింది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపురెడ్డి గ్రామంలోని 255 నెంబర్ బూత్ లో ఈవీఎం అరగంట పాటు పని చేయలేదు.
ఎల్లారెడ్డిపేట పరిధిలోని కిషన్ దాస్ పేటలోని 78వ నెంబర్ బూత్ లోనూ ఈవీఎంలో సమస్య తలెత్తగా అధికారులు సరిచేశారు. సిరిసిల్ల సుందరయ్య నగర్ లో 170వ నెంబర్ బూత్, జగిత్యాల జిల్లా కొడిమ్యాలలోని 256వ నెంబర్ బూత్ ఈవీఎంల సమస్యతో పోలింగ్ 10 నిమిషాలు లేట్ గా స్టార్ట్ అయింది. మల్యాల మండలం రామన్నపేట 311వ బూత్ లో, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులోని 32వ పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించటంతో వాటిని మార్చి కొత్తవి ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలోని 63 బూత్, వలిగొండలోని 255 బూత్ లో ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి.
బీప్ సౌండ్ రాక అనుమానాలు
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్ద దర్పల్లిలోని 40వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలలో ఓటేసిన తర్వాత బీప్ సౌండ్ రాకపోవటంతో ఓటర్లలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని 190 పోలింగ్ కేంద్రంలో, పలిమెల మండలం కామన్పల్లి పోలింగ్ కేంద్రంలో, వర్ధన్నపేట ప్రభుత్వ స్కూల్ లోని 208 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ ఆగింది. అధికారులు వచ్చి సరిచేయటంతో గంట తర్వాత పోలింగ్ తిరిగి స్టార్ట్ అయింది.