- 18,469 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ
- రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు అభ్యంతరాలకు గడువు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్యూహెచ్ఎస్) సోమవారం ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేసింది. అభ్యర్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం మొత్తం 18,469 మంది అర్హత గల అభ్యర్థులతో కూడిన జాబితాను వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దీనితో పాటు నిబంధనల మేరకు అనర్హులైన అభ్యర్థుల జాబితాను కూడా అధికారులు వెల్లడించారు.
ప్రకటించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో రేపటి వరకు (ఈ నెల 26వ తేదీ) మధ్యాహ్నం 12 గంటలలోపు సమర్పించాలని వర్సిటీ రిజిస్ట్రార్ కోరారు. అభ్యర్థులు తమ గ్రీవెన్స్‌లను knrugadmission@gmail.com ఈమెయిల్ ఐడీకి మాత్రమే పంపాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థుల ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కరించిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నారు.
18 వేల మందితో లిస్టు..
మొత్తం 18,469 మందితో కూడిన ఈ జాబితాలో కొంపెల్ల సాయి గాయత్రి తేజోఅరుణిమ 693 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. 690 మార్కులతో దేవేశ్ శ్రీగోపాల్ అగర్వాల్ రెండో స్థానంలో, 686 మార్కులతో మామిడి చైతన్య మూడో స్థానంలో నిలిచారు. అభ్యర్థుల నీట్ యూజీ–2026 స్కోరుకు ఎన్సీసీ వెయిటేజీ ఉన్న వారికి అదనపు మార్కులను కలిపి ఫైనల్ స్కోర్‌ను లెక్కించారు.
ఈ జాబితాలో అభ్యర్థుల రోల్ నంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ వివరాలను పొందుపరిచారు. కాగా, ప్రత్యేక కేటగిరీలైన దివ్యాంగులు (పీడబ్ల్యూడీ), మాజీ సైనికోద్యోగుల పిల్లలు (సీఏపీ), సింగరేణి కాలరీస్ (ఎస్సీసీఎస్) కోటా అభ్యర్థుల మెరిట్ లిస్టును విడిగా ప్రదర్శించనున్నారు. ఫైనల్ మెరిట్ లిస్టు విడుదలైన వెంటనే వర్సిటీ వెబ్సైట్లో సీట్ల వివరాలతో కూడిన సీట్ మ్యాట్రిక్స్‌ను ప్రదర్శిస్తారు. అనంతరం మొదటి విడత కౌన్సెలింగ్ కోసం వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి అధికారిక వెబ్సైట్ www.knruhs.telangana.gov.in సందర్శించాలన్నారు.
