డబ్బు చెల్లిస్తావా.. జైలుకెళ్తావా..? రజనీకాంత్ నిర్మాతకు హైకోర్ట్ డెడ్ లైన్!

 డబ్బు చెల్లిస్తావా.. జైలుకెళ్తావా..? రజనీకాంత్ నిర్మాతకు హైకోర్ట్  డెడ్ లైన్!

సూపర్ స్టార్ రజనీకాంత్  కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఇండియాలోనే మొట్టమొదటి మోషన్ క్యాప్చర్ చిత్రంగా తెరకెక్కిన సినిమా 'కొచ్చడయాన్' (2014). ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద అశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. ఆ సినిమా చుట్టూ ముసురుకున్న వివాదాలు మాత్రం దశాబ్దం దాటినా  వెంటాడుతూనే ఉన్నాయి. తాజా ఈ మూవీకి సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

అసలేం జరిగింది? 

ఈ సినిమా నిర్మాణానంతర పనుల కోసం, విడుదలకు సహకరించేందుకు 'మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్' సంస్థ, 'యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్' అనే సంస్థ నుంచి రూ.10 కోట్లు అప్పుగా తీసుకుంది. ఆ అప్పులో భాగంగా కొంత మొత్తాన్ని చెల్లించేందుకు రూ.5 కోట్ల విలువైన చెక్కులను ఇచ్చారు. అయితే, ఆ చెక్కులను బ్యాంక్‌లో వేసినప్పుడు, పేమెంట్ నిలిపివేయాలని ప్రొడక్షన్ కంపెనీ బ్యాంక్‌కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. తమకు రావలసిన డబ్బు రాకపోవడంతో యాడ్ బ్యూరో అధినేత అభిర్‌చంద్ నహర్, మీడియా వన్ డైరెక్టర్ మురళీ మనోహర్‌పై చెక్ బౌన్స్ కేసు వేశారు.

కోర్టులో సుదీర్ఘ పోరాటం

చెన్నైలోని ట్రయల్ కోర్టు ఈ కేసును విచారించి మురళీ మనోహర్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, వడ్డీతో కలిపి రూ. 7.70 కోట్లు పరిహారంగా చెల్లించాలని గతంలోనే ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం, హైకోర్టు జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ, పరిహారం మొత్తాన్ని  రూ.2.52 కోట్లుగా నిర్ణయించింది.

►ALSO READ | Pawan Kalyan: ఓవర్సీస్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' రికార్డుల వేట.. 2 లక్షల డాలర్లు దాటిన సేల్స్!

హైకోర్టు చివరి అవకాశం!

మార్చి 15న జరిగిన విచారణలో జస్టిస్ సుందర్ మోహన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మురళీ మనోహర్ ఇప్పటికే రూ.25 లక్షలు చెల్లించినట్లు కోర్టు గుర్తించింది. మిగిలిన రూ. 2.27 కోట్లను రెండు వాయిదాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. వాటిల్లో మార్చి 20 లోపు కోటి. ఏప్రిల్ 20 లోపు మిగిలిన రూ. కోటి 27 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ సొమ్ము చెల్లించడంలో విఫలమైతే.. ఎటువంటి మినహాయింపు లేకుండా మురళీ మనోహర్ ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని కోర్టు  వార్నింగ్ ఇచ్చింది. 

లత రజనీకాంత్ కేసుతో సంబంధం?

ఇదే సినిమాకు సంబంధించి రజనీకాంత్ భార్య లత రజనీకాంత్ పై కూడా ఫోర్జరీ , తప్పుడు పత్రాల సమర్పణ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు కోర్టులో ఆ కేసు కూడా ప్రస్తుతం విచారణలో ఉంది. వెండితెరపై మ్యాజిక్ చేయాలనుకున్న 'కొచ్చడయాన్', తెర వెనుక మాత్రం ఇలాంటి న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకోవడం పట్ల సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.