హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించడంలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. నదీజలాలు, ప్రాజెక్టులపై రాష్ట్రాల అధికారాన్ని హరిస్తూ కేంద్రం తీసుకొచ్చిన గెజిట్ను ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు. కృష్ణా నది జలాల్లో న్యాయమైన వాటా సాధన కోసం బుధవారం ఆయన హైదరాబాద్లోని టీజేఎస్ స్టేట్ ఆఫీసులో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఇంతకాలం టీఆర్ఎస్ ఉండడంతో తెలంగాణ గురించి మాట్లాడక పోతదా అనే ఆశ ఉండేదని, కానీ ఇప్పుడు ఆ టీఆర్ఎస్ లేదన్నారు. కృష్ణా నదిలో వాటా కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని గుర్తు చేశారు.
మళ్లీ ఉద్యమించాలి : ప్రొఫెసర్ హరగోపాల్
దీక్షను ప్రారంభించిన పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, తెలంగాణ మీద ప్రేమ టీఆర్ఎస్ నాయకత్వానికి ఉందా అనే విషయంలో తనకు అనుమానంగానే ఉందన్నారు. సమస్యలపై మళ్లీ జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని సంపదను రక్షించుకునేందుకు ఆంధ్రా నాయకులు బీఆర్ఎస్లో చేరు తున్నారన్నారు. చంద్రబాబు, షర్మిల తెలంగాణలో అధికారం కోసం సభలు, సమావేశాలు నిర్వహస్తున్నారని, తెలంగాణను హిందూ రాష్ట్రం చేయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందన్నారు. దీక్షకు కాంగ్రెస్ నేత మల్లు రవి, రిటైర్డ్ ఇంజినీర్ లక్ష్మీనారా యణ, 1969 ఉద్యమకారుడు, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ననుమాస స్వామి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్, పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవ చారి, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు నాగయ్య, టీఎస్ ఎఫ్ఎం ఫోరం ప్రతినిధి దేశాయి కరుణాకర్ మద్దతు ప్రకటించారు.

