V6 News

ఎమ్మెల్సీగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణం..కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు

ఎమ్మెల్సీగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణం..కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు
  • మంత్రి పదవిపై ఆశ లేదు: కోదండరాం
  •     మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్త: మంత్రి అజారుద్దీన్

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణం చేశారు. సోమవారం శాసనమండలిలో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్ అటెండ్ అయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం కోదండరాం, మంత్రి అజారుద్దీన్ కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రమాణం తర్వాత కోదండరాం మాట్లాడుతూ ఎమ్మెల్సీ నియామకానికి సహకరించిన  గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ తెలిపారు. ఎంతో కాలంగా వివాదాస్పదంగా ఉన్న అంశం పరిష్కారం అయిందన్నారు. పదవులు అనేవి శాశ్వతం కావని అన్నారు. “ఒకాయన నేను పోరాడుతానా లేదా అని అన్నారు, నేను పోరాడి చూపిస్త. ఇప్పటి వరకు చేస్తున్న పనిని సమర్థంగా చేయటానికి ఎమ్మెల్సీ పదవి ఉపయోగపడుతుంది. మంత్రి పదవిపై ఆశ లేదు” అని స్పష్టం చేశారు. అనేక కేసులు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన పని ఆగలేదని, ముందుకే సాగుతుందని తెలిపారు. 

వివాదాస్పద సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేస్తానని, స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకొని పని చేస్తానని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. జయశంకర్ కు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతానని తెలిపారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని కోదండరాం తెలిపారు.అంతకు ముందు నాంపల్లి లోని టీజేఎస్ పార్టీ ఆఫీస్ నుంచి గన్ పార్క్ వరకు పార్టీ నేతలు, ఉద్యమకారులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం అమరవీరుల స్థూపానికి కోదండరాం నివాళి అర్పించారు.

పొలిటికల్ ​ఫ్యాన్స్​ను పెంచుకుంటా

శాసనమండలిలో మీడియాతో మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీకి అజారుద్దీన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సహచర మంత్రులకు, పీసీసీ చీఫ్ కు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు పొలిటికల్ అభిమానుల కంటే క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువని పొలిటికల్ ఫ్యాన్స్ ను కూడా పెంచుకుంటానని అన్నారు. ఇంకా కష్టపడి పని చేస్తానని, మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అజారుద్దీన్ వెల్లడించారు.  మా కెప్టెన్ రేవంత్ రెడ్డి అని, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో స్కీమ్ లు అమలు చేస్తున్నదన్నారు. రాజకీయాల్లో క్లీన్ బోల్డ్ ఉండదని, రాజకీయాల్లో చూస్తూ ఆడుకుంటూ పోవాలని, ప్రత్యర్థి పార్టీలు ఏమైనా మాట్లాడుతాయని, అది సహజమన్నారు.