తుమ్మిడిహెట్టిని నిర్మించి.. ఎల్లంపల్లికి కలపాలి : కోదండరాం

తుమ్మిడిహెట్టిని నిర్మించి..  ఎల్లంపల్లికి కలపాలి : కోదండరాం
  •     మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇప్పుడే ఉపయోగించలేం: కోదండరాం
  •     జలసాధన సమితి, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్​సమావేశం 

హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట, వెలుగు: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించి యుద్ధ ప్రాతిపదికన ఎల్లంపల్లికి అనుసంధానించాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇప్పుడే ఉపయోగించడం సాధ్యం కాదని.. హైదరాబాద్‌‌కు నీళ్లు అందించేది కేవలం ప్రాణహిత నది మాత్రమేనని.. తక్షణమే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌‌ క్లబ్ లో తెలంగాణ జలసాధన సమితి, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జల సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ నైనాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రొఫెసర్​ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. 

ప్రొఫెసర్​ కోదండరాం మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా తుమ్మిడిహెట్టి నుంచి ఆదిలాబాద్‌‌కు నీటిని తరలించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. నైనాల గోవర్ధన్​మాట్లాడుతూ.. మేడిగడ్డ కుంగిపోవడం, ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం మూడు బ్యారేజీలు ఉపయోగంలో లేకుండా పోవడంతో రాష్ట్రం కరువును ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నదిలో నీరు లేనప్పుడు ఎత్తిపోతలు ప్రశ్నార్థకమని, టి. హనుమంతరావు చతుర్విధ జల ప్రక్రియ ద్వారా సిమెంట్, ఇసుక, ఉక్కు, కాంక్రీట్ లేకుండా చౌకగా వర్షపు నీటిని అందించవచ్చని సూచించారు. 

జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని ఆరోపించారు. కేవలం ముగ్గురు ఇంజినీర్ల దగ్గరే ఏసీబీ దాడిలో రూ. వెయ్యి కోట్లు లభించడం చూస్తుంటే బడా నాయకులు, కాంట్రాక్టర్ల వద్ద ఎంత అవినీతి ధనం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నీటిపారుదల విశ్లేషకులు సారంపల్లి మల్లారెడ్డి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి టీ. శ్రీనివాస్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి ఎం.హన్మేష్, రైతు నాయకులు రామన్న, పీవోడబ్ల్యూ సంధ్య, ఝాన్సీ, ప్రజా ఫ్రంట్ నాయకులు జైపాల్ సింగ్, లాల్ కుమార్ శ్రీనివాస్, అనురాధ పాల్గొన్నారు.