- ఆయనది అవగాహనలేనితనమని కామెంట్
- వచ్చే నెల 12న పార్టీ ప్లీనరీ.. పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని ఆయన గుర్తుచేశారు. తేజస్వి సూర్య ఇంగిత జ్ఞానం లేకుండా బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులకు తెలంగాణ ఏర్పాటును ముడిపెట్టడం ఆయన అవగాహన లేమికి నిదర్శనమన్నారు. శుక్రవారం టీజేఎస్ రాష్ట్ర నాలుగో ప్లీనరీ పోస్టర్ ను కోదండరాం ఆవిష్కరించి మాట్లాడారు. వచ్చే నెల 12న హైదరాబాద్ జలవిహార్ లో పార్టీ ప్లీనరీ నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్లీనరీలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతున్న టైంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు ఆయనను నిలవరించకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు ఆయన చేశారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏందని నిలదీశారు. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కోదండరాం గుర్తు చేశారు.
డీలిమిటేషన్‌తో చిన్న రాష్ట్రాలకు తీవ్ర నష్టం
సీట్ల కేటాయింపు జనాభా ప్రాతిపదికన జరుగుతుందని, అది 2011 జనాభా లెక్కల ప్రకారమా లేదంటే 2026 జనాభా లెక్కల ప్రకారమా అన్న విషయంలో స్పష్టత అవసరమన్నారు. 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అసమానతలను పెంచే ప్రమాదం ఉందన్నారు. అన్ని రాష్ట్రాలకు సముచిత భాగస్వామ్యం ఉండేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తేజస్వి సూర్య దిష్టిబొమ్మను నాంపల్లిలోని పార్టీ ఆఫీస్ ఎదురుగా దహనం చేశారు.

