సేఫెస్ట్ స్టేట్స్ లిస్ట్ లో కోల్‌కతా టాప్.. మూడో ప్లేస్ లో హైదరాబాద్

సేఫెస్ట్ స్టేట్స్ లిస్ట్ లో కోల్‌కతా టాప్.. మూడో ప్లేస్ లో హైదరాబాద్

కోల్‌కతా మరోసారి దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచింది. మెట్రోపాలిటన్‌ నగరాల్లో ప్రతి లక్ష మందికి అతి తక్కువ గుర్తించదగిన నేరాలు నమోదయ్యే నగరంగా నిలిచిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  (NCRB)నివేదిక వెల్లడించింది. 2022 సంవత్సరంలో ప్రతి లక్ష మందికి కేవలం 86.5 కేసులతో కోల్‌కతా ప్రథమ స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో పుణె(280.7), హైదరాబాద్‌(299.2) నగరాలు నిలిచాయి. ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదైన కేసులను మాత్రమే గుర్తించదగిన నేరాలుగా పరిగణిస్తారు. ఈ క్రమంలో కోల్‌కతాలో 2021లో లక్ష మంది జనాభాకు103.4గా నమోదైన కేసులు 2022కి 86.5కు తగ్గిపోయాయి. దేశంలో 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాల్లో నమోదైన నేరాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా ఈ ర్యాంకులను ప్రకటించారు.

2021తో పోలిస్తే కోల్‌కతాలో మహిళలపై నేరాల సంఖ్య పెరిగింది. 2021లో మహిళలపై నేరాల సంఖ్య 1783గా ఉండగా, 2022లో ఆ సంఖ్య 1,890కి చేరింది. పుణెలో ప్రతి లక్ష జనాభాలో మహిళలపై నేరాలు 27.1 శాతంగా ఉంది. కోయంబత్తూరు( 12.9 శాతం), చెన్నై(17.1)తో పోలిస్తే ఇది ఎక్కువ. కాగా కోల్‌కతాలో ఈ ఏడాది హత్యలు సైతం తగ్గాయి. 2021లో 45 హత్యలు నమోదు కాగా 2022లో ఆ సంఖ్య 34కు తగ్గిపోయింది. ఇక అత్యాచారాల కేసుల్లో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించలేదు. 2021లో 11 అత్యాచారాల కేసులు నమోదు కాగా 2022లో కూడా అదే సంఖ్య రిపీటైంది. NCRB రూపొందించిన ఈ నివేదిక 'క్రైమ్ ఇన్ ఇండియా 2022' అనే పేరుతో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ఏజెన్సీల నుండి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించబడింది.