- పూరి గుడిసెల్లోనే జోడేఘాట్ వాసులు
- కేసీఆర్, కేటీఆర్ హామీలు గాలికి
- కుమ్రం భీమ్ వారసులకూ దక్కని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
ఆసిఫాబాద్, వెలుగు: జల్.. జంగల్… జమీన్ కోసం నిజాం నవాబులతో వీరోచితంగా పోరాడి వారి తూటాలకు అసువులు బాసిన అడవితల్లి ముద్దు బిడ్డలు కుమ్రం భీం పోరుగడ్డ వాసులు. జోడేఘాట్ పేరు విశ్వవ్యాప్తం చేసినా గ్రామస్తుల బతుకుల్లో మాత్రం వెలుగులు నిండడం లేదు. జోడేఘాట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా నేటికీ నెరవేరలేదు. పోరు సల్పిన పన్నెండు గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కనీస సౌకర్యాలు లేక గిరిపుత్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే కుమ్రంభీం వర్థంతికి హడావుడి చేసే అధికారులు, ప్రజాప్రతినిధులు తర్వాత గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో గిరిపుత్రుల సమస్యలు గుట్టలు దాటి గవర్నమెంట్ ఆఫీసర్ల చెవిన పడటం లేదు. గిరిజన జీవన విధానాన్ని అభివృద్ధి పరుస్తామని, వారికి సకల సౌకర్యాలు, భూములకు పట్టాలు అందిస్తామని ప్రతిసారి ఎన్నికల్లో, భీం వర్థంతి దర్బార్ లో వాగ్ధానాలు చేసే నాయకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి.
నెరవేరని తండ్రీకొడుకుల హామీ
2014లో ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో నిర్వహించిన కుమ్రంభీం వర్థంతి, దర్బార్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్హాజరయ్యారు. జోడేఘాట్ ను పర్యటక కేంద్రంగా మార్చేందుకు గిరిజన మ్యూజియం కోసం రూ. 25 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే జోడేఘాట్ ప్రజలకు 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసి, పన్నెండు గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏడాది తిరగకుండానే రూ. 25 కోట్లు మంజూరు చేసి గిరిజన మ్యూజియం నిర్మించారు. కానీ నేటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీ నెరవేరలేదు. నూతనంగా నిర్మించిన కుమ్రంభీం మ్యూజియాన్ని షురూ చేయడానికి మంత్రి కేటీఆర్, అప్పటి గిరిజన శాఖ మంత్రి చందులాల్ భీం వర్థంతికి 2016లో హాజరయ్యారు. 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని కేటీఆర్ సైతం హామీ ఇచ్చారు. జోడేఘాట్ లో నేటికీ ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టలేదు.
కనీస సౌకర్యాలు కరువు
కుమ్రంభీం పోరుగడ్డ జోడేఘాట్, కోళాంగూడ, పాట్నపూర్, పెద్ద పాట్నపూర్, శివగూడ, బాబేఘరి, మహరాజ్ గూడ, పాటగూడ, చాల్ బాడీ, టోకెన్ మోవాడ్, లైన్ పటార్, పిట్టగూడ గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక అడవి బిడ్డలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రెనేజీలు లేక మురుగు ఇండ్లలోకి వస్తోందని, రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు వారం రోజులుగా జోడేఘాట్ కు సరఫరా కావడం లేదని, గ్రామంలో ఉన్న ఒకే చేతిపంపు వద్ద పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. టాయిలెట్లు మంజూరు చేయకపోవడంతో ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. జోడేఘాట్ నుంచి డెమ్మిడిగూడ వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఈ రోడ్డు సౌలత్ ఏర్పడితే జిల్లా కేంద్రానికి రాకపోకలు సులభంగా ఉంటాయని అంటున్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఎండిపోతున్న మొక్కలు
జోడేఘాట్ లోని ధీరభూమిలో 2015లో సుమారు 17 వేల మొక్కలు నాటారు. ఇందుకు రూ. 14.76 లక్షలు ఖర్చు చేశారు. అలంకరణ మొక్కల కోసం రూ. 1.60 లక్షలు ఖర్చు చేశారు. గత ఏడాది సైతం 15 వేల మొక్కలు నాటారు. ప్రతి ఏడాది వేలాది మొక్కలు నాటుతున్నా అటవీశాఖ అధికారులు వాటి సంరక్షణ పట్టించుకోవడం లేదు. ఫలితంగా విలువైన మొక్కలు ఎండిపోతున్నాయి. ధీరభూమికి ఒక వైపు ఫెన్సింగ్లేకపోవడంతో మొక్కలు పశువుల పాలవుతున్నాయి. నిర్వహణ లోపం కారణంగా చెట్లు ఎండిపోతున్నాయి. పిచ్చి మొక్కలతో ధీరభూమి ప్రాంతం నిండిపోయింది.
గుడిసెలోనే ఉంటున్నం
మా తాత ఏ హక్కుల కోసమైతే పోరాటం చేసిండో ఆ హక్కులు ఇంకా పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇప్పటికి జోడేఘాట్ లో మేమంతా పూరి గుడిసెల్లోనే ఉంటున్నాం. ఉండడానికి ఇల్లు లేదు. వర్షం వస్తే కురుస్తుం ది. కష్టంగా ఉంది. మాకు ఇల్లు కట్టి ఇవ్వాలి. – సోంబాయి, కుమ్రం భీమ్ మనుమరాలు
హామీ నెరవేర్చాలి
కుమ్రంభీం సాక్షిగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీలను భీం వర్థంతిలోపు నెరవేర్చాలి. లైన్ పటాన్ గ్రామ ప్రజలకు కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఈనెల 13 న భీం వర్థంతి ఉంది. ఆలోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముగ్గులు వేసి పనులు షురూ చేయాలి. లేదంటే పన్నెండు గ్రామాల ప్రజలంతా కలిసి హట్టి ప్రధాన గేటు వద్ద ధర్నా చేస్తాం. మా సమస్యలు పరిష్కారం కాకపోతే వర్థంతికి కూడా పోం. – పెందోర్ మోహన్, జోడేఘాట్ గ్రామస్థుడు


