అద్దంకిని సస్పెండ్ చేసేదాకా తగ్గేదేలె..

అద్దంకిని సస్పెండ్ చేసేదాకా తగ్గేదేలె..

కాంగ్రెస్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం కాకరేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పినా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. తాజాగా కాంగ్రెస్కు తాను చేసిన సేవలను ట్విట్టర్లో చెప్పుకొచ్చారు.  మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి..హోమ్ గార్డుగా పనిచేస్తున్నానని తన ఖాతా హిస్టరీలో రాసుకొచ్చారు. అంతేకాకుండా నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఓ సారి మంత్రిగా వర్క్ చేశానన్నారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నానని..ట్విట్టర్ హిస్టరీలో చెప్పుకొచ్చారు. 

రేవంత్ క్షమాపణ..

అంతకుముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. చండూర్ బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంటే గౌరవం ఉందన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్తున్నట్లు తెలిపారు. హోంగార్డు ప్రస్తావనపై కూడా వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదు.. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేస్తున్నాను’’ అని ఆయన వెల్లడించారు.  

అద్దంకిని సస్పెండ్ చేస్తేనే..

అటు రేవంత్ క్షమాపణను అంగీకరించేది లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. అద్దంకి దయాకర్ ను శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాతే క్షమాపణల గురించి ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పడం సంతోషమేనని తెలిపారు. రేవంత్ రెడ్డి క్షమాపణ గురించి మీడియా ద్వారానే తెలిసిందన్నారు. ‘‘ఉద్యమకారుడినైన నన్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలిగించింది ’’ అని వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేస్తేనే... మునుగోడులో ప్రచారానికి వెళ్తానని తెలిపారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంటే తమాషాగా అనిపిస్తుందా.. చిన్న పిల్లాడిలా అద్దంకి దయాకర్ మాట్లాడారని చెప్పారు. సారీ చెప్తే సరిపోదని కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేయాల్సిందేనని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ..అద్దంకి దయాకర్ మరోసారి సారీ చెప్పారు. చండూరు బహిరంగ సభలో తాను మాట్లాడిన అభ్యంతరకర మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘నా నోటి నుంచి మరో సారి ఇలాంటి మాటలు రావు’ అని ఆయన హామీ ఇచ్చారు.

అభివృద్ధి జరుగుతుంది అంటే నేను రాజీనామా చేస్తా..

రాజీనామా చేస్తే అభివృద్ధి అవుతుంటే అంటే భువనగిరి ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు మునుగోడు ఎన్నికలు సెమీఫైనల్ అని చెప్పారు. మునుగోడు ఎన్నికల కోసం తనను సంప్రదింపకుండా కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారని.. వాళ్లే చూసుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ ఫాం హౌస్ నుంచి, ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తాడన్నారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గనికి అభివృద్ధి వరాలు కురిపిస్తార చెప్పారు. మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు తెలియదని..మీడియానే సర్వే చేసి చెప్పాలని కోరారు.

 పిలవని పేరంటానికి ఎలా వెళ్తా..

మరోవైపు మునుగోడులో ప్రచారానికి తనకు ఆహ్వానం లేదని పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పిలవని పేరంటానికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. పార్టీలోని ఐపీఎస్ లాంటి పెద్దలే మునుగోడులో గెలిపిస్తారని కామెంట్ చేశారు. పార్టీ నుంచి ఒక్కొక్కరిగా వెళ్తున్నా పట్టించుకోవడం లేదని.. తనను మునుగోడులో అనరాని మాటలు అనిపించారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.