5 శాతం ఐఆర్​తో ఉద్యోగులను సర్కారు అవమానించింది: కోమటిరెడ్డి

5 శాతం ఐఆర్​తో ఉద్యోగులను సర్కారు అవమానించింది: కోమటిరెడ్డి
  •  ఎన్నికల ముందు పీఆర్సీ వేయడం సిగ్గుచేటు : ఎంపీ కోమటిరెడ్డి
  • 15 నుంచి 20 శాతం ఐఆర్​ ఇవ్వాలని సీఎం కేసీఆర్​కు లేఖ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో డ్యూటీలు పక్కనపెట్టి పోరాడిన ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు మొండి చెయ్యి చూపించిందని కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి మండిపడ్డారు. పదేండ్లలో ఒక్క ఐఆర్​(ఇంటీరియం రిలీఫ్​) కేవలం 5 శాతం ఇచ్చి ఉద్యోగులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ గడువు మూడు నెలల కిందటే ముగిసినా.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న టైంలో వేయడం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​ హయాంలో వైఎస్​ రాజశేఖర్​రెడ్డి 2004లో 8 శాతం, 2008లో 22 శాతం, కిరణ్​ కుమార్​ రెడ్డి 27 శాతం చొప్పున ఐఆర్​ ప్రకటించారని గుర్తు చేశారు.

కానీ, కేసీఆర్​ ప్రభుత్వం మాత్రం 2018లో ఐఆర్​ ఏమీ ఇవ్వకపోగా.. ఇప్పుడు కేవలం 5 శాతం ఇచ్చి అవమానించిందని విమర్శించారు. ఉద్యోగులకు 15 నుంచి 20 శాతం ఐఆర్​ ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన డీఏ విషయంలోనూ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదన్నారు. కాంగ్రెస్​ పాలనలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. కేసీఆర్​ తీరుపై ఉద్యోగులు ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించాలని కోరారు. ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు తిరగబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తర్వాత రాబోయేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఐఆర్, పీఆర్సీ, డీఏలను ప్రకటించి అందరికీ లాభం చేస్తామని కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి హామీ ఇచ్చారు.