కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని హైదరాబాద్ – విజయవాడలను కలిపే ఎన్ హెచ్ 65ని నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లకు మార్చాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. హైవేపై ప్రమాదకరంగా గుర్తించిన 17 ప్రాంతాలకు మరమ్మతులు చేయాలంటూ వినతి పత్రం అందజేశారు. సోమవారం ఢిల్లీలో గడ్కరీతో భేటీ అయిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఎన్ హెచ్ 65 రహదారి విస్తరణ, పనులను స్పీడప్ చేయాలని అభ్యర్థించారు. రాబోయే రెండు నెలల్లో రహదారి విస్తరణ పనులు ప్రారంభిస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు వెంకట్​రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని, బ్లాక్ స్పాట్లను మరమ్మతులను పూర్తి చేస్తామని చెప్పారన్నారు.

ఆర్థిక వ్యవహారాల సలహా కమిటీ మీటింగ్ లో ఎంపీ వెంకట్​రెడ్డి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో జరిగిన ఆర్థిక వ్యవహారాల సలహా కమిటీ మీటింగ్ లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై), సామాజిక భద్రతా స్కీమ్ అమలుపై చర్చలో భాగంగా తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను వెంకట్​రెడ్డి లేవనెత్తారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 55శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధరంగాలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. దాదాపు 35లక్షల కుటుంబాలు పౌల్ట్రీ రంగాన్ని జీవనాధారంగా ఎంపిక చేసుకున్నారని వివరించారు. పౌల్ట్రీ, గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడినోళ్లకు సకాలంలో రుణ సదుపాయం అందడం లేదన్నారు.